న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో కోర్టు విచారణల రికార్డింగ్‌లు అనియంత్రితంగా వ్యాప్తి చెందడాన్ని ‘బయటపడిన భూతం’గా సుప్రీం కోర్ట్ అభివర్ణించింది. సంబంధిత కోర్ట్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణల ఆడియో-వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సుప్రీం కోర్ట్ నిషేధించింది.
కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, వీడియో ప్రసారాన్ని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సీజేఐతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ‘సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ లేదా సుప్రీం కోర్ట్ సెక్రటరీ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా, విచారణల ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, రీ-పోస్ట్ చేయడం, లాంటివి చేయకూడదు’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.