న్యూఢిల్లీ, జూలై 24 : నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండాలని పలు విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులను హెచ్చరించాయి. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నదని, అందువల్ల ఆ ప్రాంతానికి వెళ్లవద్దని ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్ సహా పలు యూనివర్సిటీలు విద్యార్థులకు సూచించాయి. ‘విద్యార్థులు, బోధనా సిబ్బంది భద్రత మాకెంతో ముఖ్యం.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న చట్టవ్యతిరేకమైన సమావేశాలు లేదా ఆందోళనలపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది’ అని ఢిల్లీ యూనివర్సిటీ జారీచేసిన నోటీసులో పేర్కొంది. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం విద్యార్థుల భద్రతకే కాకుండా వారి విద్యాపరమైన రికార్డులకు, భవిష్యత్తు వృత్తిజీవితానికి హానికరంగా ఉండవచ్చని హెచ్చరించింది. సోషల్‌మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.