హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : రాత్రివేళ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకొచ్చిన రేడియం స్టిక్కర్ల వ్యవహారంలో భారీగా అవినీతి చోటుచేసుకుంటున్నదని వాహనదారులు వాపోతున్నారు. చిన్నవాహనాలు మొదలు భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు వేయడానికి, తద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీకి లింక్ పెట్టి.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కేవ లం 5 ఏజెన్సీలకే రవాణాశాఖ టెండర్లు కట్టబెట్టడం ఈ అనుమానాలకు మరిం త బలాన్ని ఇస్తున్నది.
ముందస్తు ప్రణాళికలో భాగంగా సిండికేట్‌గా మారిన కంపెనీలు రవాణాశాఖతో కుమ్మకై అందినంత దోచుకుంటున్నాయని వా హనాల యజమానులు మండిపడుతున్నారు. క్యూఆర్ కోడ్ కలిగిన స్టికర్లు, టేప్స్ ఉన్న వాహనాలకు మాత్రమే రోడ్లపై అనుమతి ఉంటుందని రవాణాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో.. పాత స్టికర్లను తీసేసి, క్యూఆర్ కోడ్ ఉన్న కొత్త స్టిక్కర్ల కోసం హెవీ వెహికిల్స్ యజమానులు క్యూ కడుతుండగా, ఆ ఐదు కంపెనీలు అడ్డంగా దోచుకుంటున్నాయని వాపోతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా కంపెనీల ముందుకు క్యూ కడుతున్న భారీ వాహనాలకు రేడియం స్టిక్కరింగ్ చేసేందుకు వాహనస్థాయిని బట్టి రూ.7వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులు చెప్తున్నారు. టెండర్లు దకించుకున్న కంపెనీల్లో ఒరాఫోల్, 3ఎం, గోల్డెన్ రిఫ్లెక్టివ్ మెటీరియల్, డామింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్, అవేరి డెనేషన్ కంపెనీలు సిండికేట్ అయినట్టు వాహనదారులు పేర్కొంటున్నారు. రవాణాశాఖ సూచించిన ధరలు కాకుండా అదనంగా వసూలు చేస్తూ వాహనదారుల జేబులు ఖాళీ చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆటోకు రూ.50కి సరిపడే రేడియం అతికించేవారు. ప్రస్తుతం రూ.200 నుంచి రూ.300 తీసుకుంటున్నారు. గతంలో కారుకు రూ.500లోపు ఖర్చు అయ్యేది. అది ఇప్పుడు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు అవుతుంది. గతంలో లారీ, బస్సులకు రేడియం టేపునకు రూ.వెయ్యి ఖర్చు కాగా, ప్రస్తుతం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు చార్జీ చేస్తున్నారు.
రవాణాశాఖ రేడియం స్టిక్కర్లకు, క్యూఆర్ కోడ్‌కు, వాహన ఫిట్‌నెస్‌కు లింక్ పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రేడియం స్టికర్లు వేసి క్యూఆర్ కోడ్ అప్డేట్ చేస్తే తప్ప సదరు వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే పరిస్థితి లేదు. రేడియం టేపు వేసి క్యూఆర్ కోడ్ ఇచ్చి అప్డేట్ చేస్తేనే ఎంవీఐ లాగిన్‌లో వాహన వివరాలు ఓపెన్ అవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాల వద్ద ఒకరిద్దరితో సదరు సంస్థ రోజుకు 40 నుంచి 50 వాహనాలకు మాత్రమే రేడియం టేపులు వేసి క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. దీనితో వేలాది వాహనాలు ఫిట్నెస్ లేకుండా ఎకడికకడ నిలిచిపోతున్నాయి.
మునుపెన్నడూ లేని విధంగా వాహనదారులను నిలువు దోపిడీ చేసేందుకు అడ్డగోలు ధరలు నిర్ణయించడం వెనుక భారీ దోపిడీ జరుగుతుందని వాహనదారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్నో కంపెనీలు ఉండగా.. కేవలం ఆ ఐదు కంపెనీలకే కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయోనని పేర్కొంటున్నారు. గతంలో ఉపయోగించిన రేడి యం టేపులతో ఎలాంటి అనర్థాలు జరుగనప్పుడు కొత్తనిబంధనలు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రేట్లు పెంచడంతో ఏడాదికి రూ.150 కోట్లకుపైగా దోపిడీ జరగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎంతమంది? వారి వాటా ఎంత? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
వాహనాల ఫిట్నెస్, రేడియం స్టికరింగ్కు ప్రభుత్వం పెంచిన రేట్లతో లారీ యజమానులపై ఆర్థికభారం పెరిగిందని ఇసుక లారీల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి వాపోయారు. ప్రభుత్వానికి ప్రతి 3 నెలలకూ ఒకసారి రూ.15వేల వరకు రోడ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా.. తమకు రవాణాశాఖ ఉచితంగా రేడియం స్టికరింగ్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో ఉత్తర్వుల ప్రతులతోపాటు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఆటోనగర్ అధ్యక్ష, కార్యదర్శులు జగదీశ్‌యాదవ్, సందీప్‌రెడ్డి, సుర్వి లింగస్వామి, గుండు లింగస్వామిగౌడ్, గుండు జంగయ్య, అంజయ్యగౌడ్, లక్ష్మీగౌడ్, అశోక్, వెంకటేశ్‌గౌడ్, ఆంజనేయులు పాల్గొన్నారు.