(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నరేంద్ర మోదీ పాలనలో దేశీయ కంపెనీలు, పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు మరోమారు రుజువైంది. 2013 కంపెనీల చట్టం ప్రకారం.. గడిచిన ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 2,04,268 ప్రైవేటు కంపెనీలు మూతబడ్డాయి. ఈ మేరకు సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా సోమవారం లోక్సభలో సమాధానమిచ్చారు. 2021-22 నుంచి గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 1,85,350 కంపెనీలను అధికారిక గణాంకాల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు.
అబ్బే.. అలాంటివేమీ లేదు
కంపెనీలకు తాళంపడితే, అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి ఏమిటని? వారికి ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రప్రభుత్వం చూపించిందా? అని సభ్యులు అడిగారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. అలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఏమీలేవని జవాబిచ్చారు. ఇక, షెల్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఆయా కంపెనీల్లో మనీలాండరింగ్ చర్యలకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. 2013 కంపెనీల చట్టంలో షెల్ కంపెనీకి సరైన నిర్వచనమే లేదంటూ చేతులు దులుపుకొన్నారు.
ఫిర్యాదులు వస్తేనే..
కంపెనీల ద్వారా జరిగే ఆర్థిక అక్రమాలను నియంత్రించడానికి ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్ మధ్య సమన్వయ బలోపేతానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సభ్యులు మరో ప్రశ్న సంధించారు. దీనికి కేంద్రం స్పందిస్తూ.. ఎప్పుడైతే అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు వస్తాయో.. అప్పుడే ఆయా లావాదేవీలపై నిఘా ఉంచాలని ఆయా ఏజెన్సీలకు ప్రభుత్వం వివరాలను చేరవేస్తుందని తెలిపింది. దీంతో ఆర్థిక అక్రమాలపై కేంద్రం వైఖరిని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు ఇచ్చే వరకూ కేంద్రం మొద్దునిద్ర వహిస్తుందా? ఇది అక్రమార్కులకు ఊతం కల్పించడమే కదా? అని మండిపడుతున్నారు.
ఇటీవలి కార్మిక చట్టాల్లోనూ అంతే!
మోదీ ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహకాలు లేక లక్షలాది చిన్న కంపెనీలు మూతబడుతున్నాయి. కార్పొరేట్లకు కొమ్ముకాస్తోన్న ఎన్డీయే ప్రభుత్వం.. ఉద్యోగులు, కార్మికులపై మాత్రం శీతకన్నే వేస్తున్నది. ఇటీవల తీసుకొచ్చిన లేబర్ కోడ్లలో ఈ విషయం మరోసారి ప్రస్ఫుటమైంది. కంపెనీలు మూతబడితే, కార్మికుల గతి ఏమిటన్న దానిపై కేంద్రానికి ఏమాత్రం సోయిలేదు. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 ప్రకారం.. 300 మంది వరకు సిబ్బంది లేదా కార్మికులు ఉన్న కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపునకు, కంపెనీల మూసివేతకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకూ 100 మంది వరకు సిబ్బంది కలిగిన కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది. దీన్ని ఇప్పుడు 300కు పెంచారు. ఒకవేళ, అధికారులు కంపెనీ మూసివేత విజ్ఞప్తికి స్పందించని పక్షంలో, మూసివేత ప్రతిపాదనకు ఆమోదంలాగానే పరిగణిస్తారు. రాష్ర్టాలు ఈ 300 పరిమితిని పెంచుకొనే వెసులుబాటు కూడా ఇచ్చారు. ఈ నిర్ణయంతో కార్పొరేట్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు కంపెనీలను మూసివేయడానికి కేంద్రం రాచమార్గాన్ని ఏర్పాటు చేసినట్లయ్యిందని కార్మికులు మండిపడుతున్నారు.
కంపెనీలు మూత ఇలా..ఆర్థిక సంవత్సరం కంపెనీలు
2020-21 – 15,216
2021-22 – 64,054
2022-23 – 83,452
2023-24 – 21,181
2024-25 – 20,365