BRS | సిద్దిపేట, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఇది రాష్ట్రంలో ఈశాన్య ప్రాం తంలో ఉంటుంది. ఇది కలిసి వచ్చే అంశం కావడంతో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఇక్కడే నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికలకు సైతం ఇక్కడి నుంచే ‘ప్రజా ఆశీర్వాద సభల’తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. ప్రతి ఎన్నికల ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. వీటన్నింటి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు హుస్నాబాద్‌తో విడదీయరాని అనుబం ధం ఉన్నది. ఈ నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాలు ఉద్యమంలో కలిసి వచ్చాయి. ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని గత ఎన్నికల్లో భారీ మెజా ర్టీ ఇచ్చాయి. అందుకే ఎన్నికల శంఖారావాన్ని మళ్లీ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నారు.
నియోజకవర్గం సస్యశ్యామలం
తనకు అచ్చొస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 1.24 టీఎంసీల సామర్థ్యం ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు సీఎం కేసీఆర్ పెంచారు. హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని కోట్ల నిధులను కేటాయించారు. మహాసముద్రం గండిని స్వయంగా సందర్శించి నిధుల కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. హరితహారంలో ముందుండాలనే లక్ష్యంతో హుస్నాబాద్‌లో స్వయంగా మొక్కలు నాటి ఇక్కడి ప్రజలకు కేసీఆర్ స్ఫూర్తినిచ్చారు. మరోసారి హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న సీఎం కేసీఆర్.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.