హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ మూకల దౌర్జన్యం రోజురోజుకూ మితిమీరిపోతున్నది. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపైనే దాడి చేసేందుకు ఇటీవల కాంగ్రెస్ మూకలు ర్యాలీలుగా వెళ్లి వీరంగం సృష్టించగా, తాజాగా పోలీస్‌స్టేషన్‌లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిబ్బందిపై ముసుగు ధరించిన 30 మంది కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
అసెంబ్లీ ఘటనపై కేటీఆర్ పీఏ, పీఆర్వోలను పండుగరోజే విచారణకు పిలిచిన పోలీసులు రకరకాలుగా వేధింపులకు గురిచేశారు. హైకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కిన పోలీసులు.. సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో అసెంబ్లీ ఎదుట మరోసారి హడావుడి చేశారు. సాయంత్రం ఇతరులను బయటకు పంపారు. ఇదే సమయంలో స్టేషన్‌కు వచ్చిన కొందరు ముసుగు దుండగులు దాడికి ప్రయత్నిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదంటుని కేటీఆర్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
వినాయక చవితి పర్వదినం రోజు సైఫాబాద్ ఠాణాలో చోటుచేసుకున్న ఈ ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ నెల 7న అసెంబ్లీ గేట్‌నంబర్-3 వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నప్పుడు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీనియర్ జర్నలిస్టులైన కేటీఆర్ పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్‌పై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో వారిద్దరినీ వినాయక చవితి పండుగ రోజైన సోమవారమే పోలీసులు విచారణకు పిలిచారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ విచారణ జరుపాలంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసింది. ఈ కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. 35(3)కింద నోటీసులు ఇవ్వాలని న్యాయవాదులు పట్టుబట్టారు. ఆ తర్వాత కేటీఆర్ సిబ్బందిని విచారించే క్రమంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పారు. పోలీసులు వారిని అసెంబ్లీ వద్దకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తిరిగి స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరిపారు.

ఆ రోజు ఏం జరిగిందంటే?
ఈ దాడి ఘటనకు సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో సీనియర్ జర్నలిస్టులైన కేటీఆర్ పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్ వివరించారు. వినాయకచవితి రోజు ఉదయం 9 గంటలకు వారిద్దరూ విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల సూచన మేరకు విచారణకు పూర్తిగా సహకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్టేషన్లో కరెంట్ లేదు. అయినా వారిని ఠాణాలోనే ఉంచారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌హెచ్‌వో వచ్చి ఇంటరాగేషన్ రూమ్ పేరుతో చీకటిగదికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారని వారు చెప్పారు.
తమ చుట్టూ నలుగురిని నిలబెట్టి, మొబైల్‌ఫోన్ లైట్ల మధ్య విచారణ పేరుతో వేధింపులకు గురిచేశారని మహేశ్ ముదిరాజ్, మహేందర్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన హైకోర్టు తీర్పులో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం తమను బెదిరించి భయపెట్టే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఒక్కొక్కరినీ విడివిడిగా తీసుకెళ్తామని పోలీసులు చెప్పారని, చివరికి ఒకేసారి ఇద్దరినీ తీసుకెళ్లి దాదాపు 15-20 నిముషాలు మీడియా ట్రయల్ తరహాలో వ్యవహరించారని తెలిపారు.
తిరిగి స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత మళ్లీ అదే చీకటిగదిలో కూర్చొబెట్టి, అక్కడికి సీనియర్ అడ్వకేట్లను కూడా అనుమతించకుండా కనీసం టీ ఇవ్వడానికి ఎవరినీ లోపలకు రానీయలేదని పేర్కొన్నారు. సాయంత్రం 4గంటల సమయంలో తాము మూత్రవిసర్జనకు వెళ్తుండగా సుమారు 30 మంది వ్యక్తులు మాస్కులు ధరించి కనిపించారని, అందరూ ముఖాలు కనిపించకుండా నల్లటి మాస్కులు వేసుకున్నారని మహేశ్, మహేందర్ తెలిపారు. ఆ తర్వాత సుమారు రెండు గంటలపాటు ఆ వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్టుగా వ్యవహరించారని, తామున్న గదివైపు పదేపదే వస్తూ, లోపలికి తొంగిచూశారని వారు తెలిపారు.
ఆ తర్వాత ఏసీపీ సంజయ్ స్టేషన్‌కు రావడం, ఆ వ్యక్తులు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన నుంచి తగిన సూచనలు తీసుకొని తమ మీద దాడి చేసేందుకు వచ్చినట్టు అనుమానం కలిగిందని, తాము ఆ వ్యక్తుల కదలికలపై సీసీటీవీ ఫుటేజ్ కోరితే ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో తమను మరో 10 నిముషాల్లో బయటకు పంపుతామని చెప్పి తమ వెంట వచ్చిన అడ్వకేట్లు, ఇతరులను పోలీసులు బయటకు పంపారని చెప్పారు. 6.30 గంటలకు ఎస్‌హెచ్‌వో స్వయంగా ఆ 30 మంది వ్యక్తులను స్టేషన్లోకి పిలిచారని, వారు లోపలకు వచ్చిన వెంటనే ఎస్‌హెచ్‌వోతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ తమవైపు చూస్తూ ‘మా పోలీసులను కొట్టింది వీళ్లేరా? మన పోలీసులను కొట్టింది వీళ్లేరా? ఆ కొడుకులు’ అంటూ గట్టిగా కేకలు వేస్తూ తమపై దాడికి ప్రయత్నించారని తెలిపారు.
అదే సమయంలో తీవ్రంగా అసభ్యకరమైన దుర్భాషలాడుతూ, ప్రాణహాని కలిగించేలా దాడికి ప్రయత్నించారని తెలిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై సత్యనారాయణ అడ్డుపడటంతో వారు వెనక్కి తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. ఆ సమయంలో సుమారు రెండు నుంచి మూడు నిముషాలపాటు ఎస్‌హెచ్‌వో తన కుర్చీ నుంచి లేచి కనీసం పక్కకు రాలేదని, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించనూలేదని బాధితులు చెప్పారు. ఆ తర్వాత ఏసీపీ సంజయ్ అదే గదిలోకి వచ్చి గట్టిగా అరుస్తూ బల్లలపై కొడుతూ ‘మీపై దాడి జరుగలేదు కదా! ఎందుకు కైంప్లెంట్ చేస్తారు? అంటూ బెదిరించారని తెలిపారు. ఆ తర్వాత అక్కడున్న అడ్వకేట్లను కూడా దూషించారని, అడ్వకేట్లు అభ్యంతరం వ్యక్తంచేయడంతో చివరకు సారీ చెప్పారని వివరించారు.
తమపై దాడికి వచ్చిన వారిపై ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ప్రక్రియను నాన్చారని, ఈ మధ్యలో సీనియర్ అడ్వకేట్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్టేషన్‌కు వచ్చినా సుమారు ఏడెనిమిది మంది పోలీస్ ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పదేపదే ఫోన్‌కాల్స్ చేస్తూ పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం వ్యవహారాన్ని సాగదీశారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ విషయంలో మొదట్లో చూపిస్తామని, ఆ తర్వాత డిలీట్ అయిందని, చివరకు ఫోన్లో వారికి అనుకూలమైన చిన్న వీడియోను మాత్రమే చూపించారని చెప్పారు. చివరకు సీసీటీవీ ఫుటేజ్ చూపించేది లేదని, పుటేజ్ ఇచ్చేది లేదని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబోమంటూ చెప్పి అక్కడున్న వారిని ఒక్కొక్కరినీ అరెస్టు చేయడంతో పాటు సీనియర్ నాయకులను బయటకు పంపారని మహేశ్ ముదిరాజ్, మహేందర్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం రాత్రి 9.30 నుంచి 12 గంటల వరకు సాగిందని వారు వివరించారు.
బీఆర్ఎస్ నేతలు, న్యాయవాదుల అరెస్టు!
కేటీఆర్ సిబ్బందిపై దాడి యత్నం జరిగిందన్న సమాచారం నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, లీగల్‌సెల్ న్యాయవాదులైన కళ్యాణ్‌రావు, భాస్కర్‌గౌడ్, హరీశ్, కార్తీక్, సాయినాథ్తోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యాయంకోసం డిమాండ్ చేస్తున్న న్యాయవాదులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగులు ధరించిన వ్యక్తులు ప్రవేశించి దాడికి ప్రయత్నించినా పోలీసులు కనీసం అడ్డుకోలేదని, తాము ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ ఆరోపించారు. స్టేషన్లోకి ఎస్‌హెచ్‌వో ప్రమేయం లేకుండా బయటవ్యక్తులు ఎలా వస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీస్ శాఖ విఫలమైందని, ప్రభుత్వమే దగ్గరుండి పోలీస్‌స్టేషన్‌లో దాడి చేయించిందంటూ లక్ష్మణ్ మీడియా ఎదుట చెప్పారు.
దాడి జరుగలేదు: డీసీపీ శిల్పవల్లి
కేటీఆర్ పీఆర్వో, పీఏ మహేశ్ ముదిరాజ్, మహేందర్‌పై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో దాడి జరుగలేదంటూ ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చెప్పారు. గణేశ్ మండపం వద్ద డీజే పర్మిషన్ కోసం కొందరు యువకులు స్టేషన్‌కు వచ్చారని, పోలీస్ అధికారులు వారికి అనుమతి ఇవ్వబోమని చెప్పారని తెలిపారు. ఆ సమయంలో ఆ యువకులు లోపలికి తొంగిచూసి ‘అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారని ఆమె పేర్కొన్నారు. దీంతో వారిని స్టేషన్ నుంచి బయటకు పంపించామని, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందన్న ప్రచారంలో వాస్తవంలేదని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించామని, దాడికి సంబంధించిన ఎలాంటి ఘటన కనిపించలేదని చెప్పారు.
డీజే పర్మిషన్ కోసం వచ్చిన వాళ్లు ముఖాలకు మాస్క్ వేసుకుని ఎందుకు వచ్చారని, ఇది వినడానికే విచిత్రంగా ఉన్నదంటూ పలువురు అనుమానం వ్యక్తంచేశారు. దాడి జరుగలేదంటూ డీసీపీ శిల్పవల్లి చెప్పిన వివరణపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీజే పర్మిషన్ కోసం వచ్చిన వాళ్లు సైఫాబాద్ ఎస్‌హెచ్‌వోతో దురుసుగా ప్రవర్తించినా, ఆయనతో గొడవ పడినా వారిని ఏమీ అనకుండానే బయటకు పంపించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మేడం చెప్పేది చిన్న పిల్లవాడు కూడా నమ్మేలా లేదు? కొత్తగా ట్రై చేయాలి? అంటూ సెటైర్లు వేశారు. రాజాసాబ్ సినిమా కంటే ఈ స్క్రిప్ట్ చాలా వరస్ట్‌గా ఉన్నదని, మంచి కథల పోటీల్లో ప్రాక్టీస్ చేయాలని మరికొందరు సూచించారు.
30 మంది ముసుగు వ్యక్తుల దాడి
సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లోనే ఒకవైపు మహేశ్ ముదిరాజ్, మహేందర్‌పై విచారణ జరుగుతుండగానే సాయంత్రం 6.30 గంటలకు ముసుగులు ధరించిన సుమారు 30 మంది వ్యక్తులు స్టేషన్లోకి ప్రవేశించి, తమపై దాడి చేయడానికి ప్రయత్నించినట్టు మహేశ్, మహేందర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే కేటీఆర్ సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించిన క్రమంలో ఎస్సై వారిని అడ్డుకోగా, బీఆర్ఎస్ న్యాయవాదులు గట్టిగా కేకలు వేస్తూ మహేశ్ ముదిరాజ్, మహేందర్‌ను కాపాడేందుకు లోపలికి రావడంతో ముప్పుతప్పింది. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి యత్నం జరిగినా ఎస్‌హెచ్‌వో సహా పోలీసులంతా కండ్లప్పగించి చూస్తూ ఉన్నారు. సైఫాబాద్ పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేయగా, పోలీసులు మాత్రం సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఎక్కడా దాడి జరిగినట్టుగా లేదని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. ఇందులో కుట్రకోణం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ని బయటపెట్టడానికి అభ్యంతరం ఏందంటూ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.