నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, నవంబర్ 1: ‘పార్టీని చూసి, కులాన్ని చూసి మన పార్టీ లీడర్లని పొగడటం, పక్క పార్టీ లీడర్లను తిట్టడమే నేటి రాజకీయం. జనం మారాలె. మంచిని మంచి అని, చెడుని చెడు అని చెప్పేదే రాజకీయం. ఈ నీళ్ల కోసమే గదా ఇన్నేండ్లు గోస పడ్డం. నాది నీళ్ల రాజకీయం. నీళ్లిచ్చినోళ్లతోనే నేనుంటా. మళ్లీ మళ్లీ పుట్టాలని జనం కోరుకునే లీడర్ కేసీఆర్ ఒక్కరు’ అని అంటున్నాడు మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడకు చెందిన రైతు, బీజేపీ మాజీ కార్యకర్త కాకులవరం అనంతరెడ్డి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి తాగునీరు, సాగునీటి సరఫరా గురించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ మునుగోడు ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయన చెప్పిన ముచ్చట ఇది. ఏడు పదుల అనుభవాలతో ఆయన చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
ఈ గతి పట్టిందెందుకంటే?
ఫ్లోరైడ్ నీళ్లు తాగి అందరి ఎముకలు బోలై పోయినయ్. ఫ్లోరైడ్ నీళ్లు తాగినందుకు వినికిడి లోపం, మోకాళ్లు, వెన్ను, మెడనొప్పి (స్పాండిలైటిస్)తోని ఇబ్బందులు పడుతున్న. రెండు మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న. మా ఆవిడకూ ఇదే సమస్య. కేసీఆర్ ముందుగాలనే సీఎం అయ్యుంటే అందరికీ ఈ నొప్పు లు తప్పేటియి. నొప్పుల మాత్రలు తప్పేది. కిడ్నీలు మంచిగుండేటియి. ఇప్పుడు పెట్టిన డయాలసిస్ యూనిట్ల అవసరం రాకపోయే ది. ఎంతోమందికి కాళ్లు, చేతులు వంకర్లు (స్కెలెటన్ ఫ్లోరోసిస్) రాకపోయేది.
బీజేపీ వాళ్లయి ఉత్త మాటలే..
జాగృతి పత్రిక చదివి చిన్నప్పుడే బీజేపీ అభిమానిగా మారిన. కిసాన్ మోర్చాలో పని చేసిన. ‘ఒక్క ఓటు.. రెండు రాష్ర్టా లు’ అంటే నమ్మి ఓట్లేసినం. ఓట్లేసినంక తెలంగాణను నట్టేట ముంచా రు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ తెలంగాణలో నే ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర అవసరం ఏమొచ్చింది?’ అని అద్వానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిం డు. పేపర్లో ఆ వార్త చదివినప్పటి నుంచి బీజేపీపై అభిమానం చచ్చిపోయింది.
కేసీఆర్‌కి స్వాగతం
తర్వాత ఏ పార్టీలో చేరలే. నల్లగొండ బిడ్డగా నీటి కోసం పోరాడాలని జలసాధన సమితి స్థాపించిన దుశర్ల సత్యనారాయణతో కలిసి నీళ్ల కోసం కొట్లాడిన. మా అన్న కాకులవరం మధుసూధన్ అమెరికాలో ఉంటడు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్థాపకుల్లో ఒకడు. ఎప్పుడు ఫోన్ చేసినా.. తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చెబుతుండె. తెలంగాణకు జై కొట్టమని చెప్పేవాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టిన కొత్తలో మర్రిగూడ దిక్కొచ్చిండు. మా అన్న చెబితే ఆ యాత్ర దగ్గరకు పోయిన. ‘మీ ఇల్లు పెద్దగా ఉంది. కేసీఆర్ మీ ఇంట్లోనే ఉంటడు. మీటింగు పెట్టుకుంటం’ అని టీఆర్ఎస్ వాళ్లు అడిగారు. తెలంగాణ కోసం మాట్లాడుతున్నారని రెండు రోజులు మా ఇంట్లనే అతిథ్యం ఇచ్చిన. ‘కృష్ణా నీళ్లు తెస్త.. మునుగోడు, దేవరకొండను పీడించే ఫ్లోరైడ్ సమస్యను పోగొడుత’నని ఆనాడే చెప్పిండు.
కాలువల్లో నీరు చూసుడే నా ఆఖరి కోరిక
తెలంగాణ ఉద్యమానికి భయపడి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మాకు సాగు నీరు ఇస్తనని చెప్పింది. బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్టు, ప్రాజెక్టు పనులు మొదలుపెట్టక ముందే 2008లో కాలువలకు హద్దులు పెట్టి పోయారు. ఎన్నికలు అయిపోంగనే ఆ సంగతి మరిచారు.
ఇప్పుడు మా ఊరికి దగ్గరనే శివన్నగూడెం ప్రాజెక్టు కడుతున్నరు. ఈ ప్రాజెక్టు కడుతుంటే మనసెంత సంతోషంగ ఉన్నదో. ఆ ప్రాజెక్టు పూర్తి అయితది. నా ప్రాణం పోయేలోగా కాలువల్ల పారే నీళ్లు చూడాలె.
ఆయుష్షు పెరిగేదేమో?
కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లు తేవడం వల్ల నా ఆరోగ్యం మెరుగైంది. ఇంతకుముందు పొద్దున లేస్తే నడవలేకపోయేవాడిని. చేతులు నొప్పి లేచేది. పొద్దున లేచినంక కాళ్లు పట్టేసేది. 50 అడుగుల వేసిందాక అడుగులు తడబడేది. ఇప్పుడా బాధలన్నీ పోయినయ్. ఇరవై ఏండ్ల ముందే కేసీఆర్ సీఎం అయ్యుంటే నా ఆయుష్షు ఇంకో పదేండ్లు పెరిగేదేమో. పాత సీఎంలంతా ‘మంచినీళ్లు ఇస్తం.. ఫ్లోరోసిస్ పోగొడుతం’ అన్నోళ్లే. కానీ, వాళ్ల మాటలు నీటి మీద రాతలయినై. కేసీఆర్ చేతలు మా ఊరి ట్యాంక్ మీద భగీరథ రాతైనది. కేసీఆర్‌లో ఉన్న పట్టుదల, ప్రేమ వాళ్లకు లేకనే మాకీ గతి పట్టింది. అప్పటి నేతల్ని చూసి ‘ఎందుకొచ్చిండురా ఈ లీడరు మా ఖర్మకి’ అనుకునేటోళ్లం. కేసీఆర్ వస్తే ‘ఈ సీఎం ఇరవై ఏళ్ల ముందొచ్చి ఉంటే మన బతుకెంత బాగుండునో’ అనుకుంటన్నరు. ఇదే జరిగి ఉంటే ఈపాటికి ఫ్లోరైడ్ భూమిలోకి పోయేది. ఫ్లోరైడ్కి మూడు తరాలు బలైపోయినయ్. కేసీఆర్ రేపటి తరాల్ని కాపాడిండని సంతోషమైనా మాకు మిగిలింది.
కేసీఆర్ ముందే సీఎం అయ్యుంటే..
కేసీఆర్ ముందే ముఖ్యమంత్రి అయ్యుంటే మా బతుకులు బాగుపడేటివి. ఇరవై ఏండ్ల కిందనే సీఎం అయ్యుంటే ఇప్పుడు ఇంటింటికి వచ్చిన కృష్ణా నీళ్లు అప్పుడే వచ్చేటియి. ఈ నీళ్లు తాగినందుకు 34 ఏండ్ల వయసులనే పళ్లన్నీ ఊసిపోయినయ్. కట్టుడు పండ్లతోనే నా జీవితం ఎక్కువ కాలం గడిచిపోయింది. ఇది నా ఒక్కడి సమస్య కాదు. మా ఊరి ప్రజలందరి సమస్యే. మా పెద్దలకు ఉన్నది.. మా అన్నదమ్ములకు ఉన్నది. అదే కృష్ణా నీళ్లు తాగి ఉంటే మా ఊరోళ్లందరికీ పళ్లు తెల్లగ ఉండుడే కాదు బలంగా ఉండేటియి.