హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మార్కెటింగ్ శాఖ (Marketing Department) ఏండ్లుగా ధాన్యం కొనుగోళ్లకు (Paddy Procurement) అవసరమైన పరికరాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు చెల్లించడంలేదు. ఏటా సివిల్ సప్లయ్ (Civil Supplies) నుంచి 1% కమీషన్ వస్తున్నప్పటికీ, ఆ నిధులను విడుదల చేసేందుకు ససేమిరా అంటున్నది. దీంతో బిల్లులు మంజూరుకాక సరఫరాదారులు లబోదిబోమంటున్నారు. బకాయిల కోసం ప్రతిరోజూ ఆగ్రోస్ (Agros) ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న సివిల్ సప్లయ్ శాఖ.. టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీక్లీనర్స్, ఆరబెట్టే యంత్రాలు ఇలా పలు రకాల వస్తువుల సరఫరాను మార్కెటింగ్ శాఖకు అప్పగిస్తున్నది. ఇందుకోసం కేంద్రం ఇచ్చే ధాన్యం కొనుగోలు నిధుల్లో 1% కేటాయిస్తున్నది. అయితే, పరికరాల కొనుగోలు బాధ్యతను మార్కెటింగ్ శాఖ… ఆగ్రోస్కు అప్పగిస్తున్నది. దీంతో ఆగ్రోస్ టెండర్లు పిలిచి వాటిని కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖకు అప్పగిస్తున్నది. ఇలా ప్రతి సీజన్లోనూ రొటీన్ ప్రక్రియ.
నాలుగేండ్లు.. 43 కోట్ల బకాయిలు
పరికరాల కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ఇండెంట్ ఇవ్వడం, ఆగ్రోస్ కొనుగోలు చేసి అప్పగించడం జరుగుతూ ఉన్నది. ఇందుకు సంబంధించిన కొనుగోలు నిధులు మాత్రం ఆగ్రోస్కు రావడంలేదు. నాలుగున్నరేండ్ల కిందట సరఫరా చేసిన బకాయిలు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉండటం గమనార్హం. 2020-21 నుంచి 2024-25 యాసంగి వరకు రూ.43 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ఈ నాలుగున్నరేండ్లలో మొత్తం రూ.103 కోట్ల విలువైన పరికరాలను ఆగ్రోస్ సరఫరా చేసింది. అయితే, ఇందులో రూ.60 కోట్లు విడుదలచేసిన మార్కెటింగ్ శాఖ మిగిలిన రూ.43 కోట్లు పెండింగ్ పెట్టింది. ఇందులో 2020-21 యాసంగికి సంబంధించి రూ.13 లక్షలు, వానకాలం రూ.28 లక్షలు, 2021-22 యాసంగికి రూ.73 లక్షలు, వానకాలానికి రూ.20 లక్షలు, 2022-23 యాసంగికి రూ.9.4 కోట్లు, వానకాలానికి రూ.6.2 కోట్లు, 2024-25 వానకాలానికి రూ.21 కోట్లు, యాసంగికి సంబంధించి రూ.4.5 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ విధంగా సుమారు రూ.43 కోట్లు పెండింగ్లో ఉండటం గమనార్హం.
ఆగ్రోస్కు టెండర్లు బంద్
ఒకవైపు కమీషన్ల ఆరోపణలు, మరోవైపు పనిచేయలేరనే విమర్శలు.. వెరసి ప్రభుత్వం పలు పనుల నుంచి ఆగ్రోస్ను తప్పించింది. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన పరికరాల కొనుగోలు బాధ్యతల నుంచి ఆగ్రోస్ను తప్పించింది. ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన పరికరాల కొనుగోలు బాధ్యతను ఆగ్రోస్ను కాదని హాకాకు అప్పగించింది. దీంతో ఆగ్రోస్ చేసేందుకు పనులేమీ లేకపోవడం గమనార్హం. అటు పాత బకాయిలు విడుదల కాక, ఇటు ఉన్న వ్యాపారం బంద్కావడంతో సరఫరాదారులు, అధికారులు లబోదిబోమంటున్నారు. దీంతో అధికారులు, వ్యాపారులు ఇతర దారులు వెతుక్కుంటున్నారు.
‘కమీషన్ల’ పంపకాల్లో తేడాలే కారణమా?
మార్కెటింగ్ శాఖకు సివిల్సప్లయ్ నుంచి కమీషన్ విడుదలవుతున్నప్పటికీ, ఆగ్రోస్కు బకాయిలు ఎందుకు చెల్లించడంలేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇందుకు కమీషన్ల పంపకాల్లో తేడాలే కారణమనే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జరుగుతున్నది. కమీషన్ల వాటాల్లో ఈ రెండు సంస్థల అధికారుల మధ్య ఏర్పడిన విభేదాలే బకాయిలు పేరుకొనిపోవడానికి కారణాలని చర్చించుకుంటున్నారు. తమకే ఎక్కువ కావాలంటే తమకే ఎక్కువ కావాలంటూ పట్టుదలకు పోతున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే మార్కెటింగ్ శాఖ బకాయిలు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రోస్లో రాజకీయ నేత ప్రవేశంతో ‘కమీషన్ల’ వసూళ్లు మరింత తారస్థాయికి చేరాయనే ఆరోపణలున్నాయి. ఈ రెండేండ్లలోనే సుమారు రూ.40 కోట్లకుపైగా బకాయిలున్నాయి. అయితే ఇక్కడ కమీషన్ల డిమాండ్ అధికం కావడంతో బకాయిల చెల్లింపులే నిలిపివేసినట్టు తెలిసింది. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కమీషన్లు ఇస్తేనే బిల్లుల చెల్లింపు ఉంటుంది.. లేదంటే చిల్లిగవ్వ రాదంటూ బెదిరిస్తున్నట్టు సరఫరాదారులు వాపోతున్నారు.