కరీంనగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై శనివారం ఏసీబీ దాడి జరింగింది. ఓ పండ్ల వ్యాపారి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం, సహకరించిన సెక్యూరిటీగార్డ్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కరీంనగర్ పండ్ల మార్కెట్లో లైసెన్స్‌ల రెన్యువల్ కోసం 16 మంది వ్యాపారులు కలవగా పురుషోత్తం ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలు లంచం డిమాండ్ చేశారు. రూ.60 వేలకు ఒప్పందం చేసుకున్నారు.
వ్యాపారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం నిమ్మకాయల పాషా రూ.60 వేలు సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్‌రెడ్డికి అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యదర్శి పురుషోత్తం ఆదేశాల మేరకు తీసుకున్నట్టు తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు.