Khammam | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఏటేటా పెరుగుతున్నది. ఏ సరిహద్దు చెక్‌పోస్టు చూసినా గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఇన్నాళ్లూ గోదావరి పరవళ్లు, పచ్చని అభయారణ్యాలు, బొగ్గు గనుల కేంద్రంగా, గ్రానైట్ మాగాణిగా పేరున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఇప్పుడు గంజాయి అక్రమ రవాణాకు ముఖ ద్వారంగా మారింది. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు కలిగిన ఖమ్మం.. గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా మారింది. ఏవోబీ(ఆంధ్రా ఒడిశా బార్డర్)లో సాగవుతున్న గంజాయిని ఖమ్మం ద్వారానే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత ఐదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 8,622 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారంటే అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఒడిశా, ఏపీ సరిహద్దులో ఎకరానికి రూ.లక్ష చొప్పున పెట్టుబడి పెట్టి కొందరు అక్రమార్కులు గంజాయి సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ సిబ్బంది 2020లో 7 కేసుల్లో 43 కేజీలు, 2021లో 26 కేసుల్లో 472 కేజీలు, 2022లో 161 కేసుల్లో 2999.73 కేజీలు, 2023లో 204 కేసుల్లో 3574.46 కేజీలు, 2024లో జూన్ నాటికి 100 కేసుల్లో 1533.268 కేజీల చొప్పున మొత్తం ఐదేండ్లలో 498 కేసుల్లో 8,622.508 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 2022లో 4,556 కేజీలు, 2023లో 6,355 కేజీలు, 2024(జూన్ వరకు)2,283 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
గంజాయిని అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి వినియోగం, రవాణా, అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నది. గంజాయి అక్రమ రవాణా గురించి ఎవరికైనా తెలిస్తే ఎక్సైజ్ టోల్‌ఫ్రీ నంబర్ 18004252523కు ఫిర్యాదు చేయండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.