హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నగరాల నుంచి.. పచ్చని పల్లెల వరకు డ్రగ్స్ చిచ్చు పెడుతున్నాయి. తెలంగాణలో డ్రగ్స్ తయారీ, సరఫరా దందా జోరుగా నడుస్తున్నది. రూ.500కే డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమవుతుండటంతో ‘ఉడ్తా తెలంగాణ’గా పిలువాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు, కాలేజీ విద్యార్థులు గంజాయి ప్యాకెట్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మెఫెడ్రోన్, కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు యథేచ్ఛగా దొరుకుతున్నాయి. ఇలా అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఈ మత్తు మహమ్మారి చిత్తు చేస్తున్నా.. ప్రభుత్వంలో కొంచెం కూడా చలనం లేకపోవడం దౌర్భాగ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మన హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్, వాటి ముడిపదార్థాలు పట్టుబడ్డాయంటే ఈ మహమ్మారి తెలంగాణ రాష్ర్టాన్ని ఎంతలా కమ్మేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఏకంగా స్కూల్లోనే తయారీ
ఇటీవల చర్లపల్లిలోని పారిశ్రామికవాడలో భారీ డ్రగ్ రాకెట్‌ను మహారాష్ట్ర పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ఛేదించారు. ఆ ఘటన మరువక ముందే.. హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలో ఏకంగా ఓ పాఠశాలలోనే అల్ప్రాజోలం తయారు చేస్తున్న ముఠా ఉదంతం బయటపడింది. రూ.40 లక్షల విలువ జేసే నాలుగు కేజీల అల్ప్రాజోలం, ముడిపదార్థాలు, యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికిగాని నెమ్మదిగా మేల్కొన్న ప్రభుత్వం ఈ ఘటనలపై సీరియస్‌గా ఉన్నట్టు లీకులు ఇస్తున్నది. దీంతో ఆ పాఠశాలను మూసివేయిచింది. అదే స్కూల్లో మత్తు మాత్రలు, ఇతర హానికారక రసాయనాలు ఉండటం విస్తుగొలిపే అంశం. ఇక ఆ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఎక్సైజ్‌శాఖ దాడుల్లోనే సుమారు 325 కేజీలకుపైగా ఆల్ఫ్రాజోలం పట్టుబడిందంటే.. మత్తు మహమ్మారి ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కల్తీ కల్లుతో హైదరాబాద్ కూకట్‌పల్లిలో 10 మంది మృతి చెందారు. ఆ ఘటనపై ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నా.. ఆల్ఫ్రాజోలం మత్తు జాడలు ఇంకా తెలంగాణలో కనిపిస్తూనే ఉన్నాయి.
క్వింటాళ్ల కొద్దీ గంజాయి దందా
తెలంగాణను మత్తు మహమ్మారి పట్టి పీడిస్తుందనడానికి పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు క్వింటాళ్ల కొద్ది పట్టుబడుతున్న గంజాయే నిదర్శనం. ఏ రైడ్లోనైనా కనీసం పది కేజీలకు పైగానే గంజాయి దొరుకుతున్నది. ఇక పోలీసులు నిఘా పెట్టి పట్టుకునే కేసులలోనూ పెద్దఎత్తునే గంజాయి దొరుకుతున్నది. 2024, 2025లో రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న కొన్ని టన్నుల కొద్దీ గంజాయిని అధికారికంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. ఈ ఏడాది జూలై వరకు 3,681 కేజీల గంజాయిని ఒక్క ఎక్సైజ్‌శాఖ అధికారులే పట్టుకున్నారు. తెలంగాణను ఒకవైపు గంజాయి, అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాలు పట్టిపీడిస్తుంటే.. మరోవైపు కొకైన్, ఎండీఎంఏ, ఎండీ, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ జోరుగా చలామణిలో ఉన్నాయి. ఈ డ్రగ్స్ డార్క్‌వెబ్ ద్వారా తెలంగాణలోకి వస్తున్నా… ప్రభుత్వం, పోలీసు, నిఘావర్గాలు అరికట్టలేకపోతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మత్తులోకం.. పబ్స్ అరాచకం
హైదరాబాద్ నగరంలోని పలు పబ్స్ మత్తు లోకానికి కేరాఫ్‌గా మారాయి. పబ్‌లలో డీజేలు పెట్టే చాలామంది నిర్వాహకులే డ్రగ్స్ పెడ్లర్స్‌గా మారిపోతున్నారు. అహ్మదాబాద్, గోవా, ముంబై, బెంగళూరు, చెన్నై, విశాఖ వంటి పట్టణాల్లో డ్రగ్స్ తీసుకొచ్చి, నేరుగా తెలంగాణలో విక్రయిస్తున్నారంటే ఇక్కడి ప్రభుత్వం, పోలీసులు, ఈగల్ టీమ్స్ అంటే వారికి ఎంత భయం ఉందో అర్థమవుతుంది. వీటికితోడు ఎక్కడెక్కడి నుంచో వచ్చే మందుబాబులు హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌లలో డ్రగ్ పార్టీలు చేసుకోవడం కలవరం పుట్టించే అంశం. అల్ప్రాజోలం, డ్రగ్స్ నెట్‌వర్క్‌ల వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. రేవంత్‌రెడ్డి 20 నెలల పాలనలో ‘ఉడ్తా తెలంగాణ’గా రూపుదిద్దుకున్నది. చర్లపల్లిలో రూ.12,000 కోట్ల డ్రగ్స్ పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. దేశంలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుజరాత్ తర్వాత తెలంగాణలో వెలుగుచూడడం దురదృష్టకరం’
‘మహారాష్ట్ర పోలీసులు నెలల తరబడి పరిశోధించి డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు చేస్తే.. రేవంత్‌రెడ్డికి మాత్రం సోయిలేకపోవడం సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రీ డ్రగ్స్ వ్యవహారంలో నీకేమైనా ముడుపులు ముట్టాయా? అందుకే మౌనంగా ఉన్నావా? రూ.12వేల కోట్ల డ్రగ్స్ పట్టుబడితే మీ పోలీసులకు కనీస సమాచారం రాలేదెందుకు? నీ ఈగల్ ఏం చేస్తున్నది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏంచేస్తున్నది? పోలీసుశాఖ ఇంటెలిజెన్స్ ఏంచేస్తున్నది?’– కేటీఆర్, మాజీ మంత్రి (సెప్టెంబర్ 8న మీడియాతో)
కొన్ని డ్రగ్స్ కేసుల వివరాలు