హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఏడాది గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే.. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రశ్నించారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు. దీపావళి తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇంకెప్పుడు పిలుస్తారని నిలదీశారు. ఉద్యోగులు, సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువనివ్వడం లేదని మండిపడ్డారు. సర్కారు తీరుపై ఉద్యోగులంతా బాధపడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వేసిన మంత్రుల త్రిసభ్య కమిటీ.. కాలయాపనకేనా? అంటూ జగదీశ్వర్ ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదని మండిపడ్డారు. ఆర్థికపరమైన డిమాండ్లు మార్చి తర్వాత పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారని, ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు.
సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు, మేమంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయామని ఉద్యోగులు తిడుతున్నారని, లేఖలు రాస్తున్నారని జగదీశ్వర్ ఈ సందర్భంగా వాపోయారు. ఉద్యోగులు తిట్టినా వరదబాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేశామని ఆయన గుర్తుచేశారు. గంట సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేని, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, నేతలు రాజేందర్ నరసింహస్వామి, నరసింహ, కొండల్‌రెడ్డి, ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రభుత్వం వేసిన సబ్‌కమిటీ దీపావళి తెల్లారే మిమ్మల్ని చర్చలకు పిలుస్తుంది.’ నిరుడు అక్టోబర్ 24న నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలివి. ఇక దీపావళి, న్యూఇయర్‌లో సంక్రాంతి గడిచిపోయాయి. ఫిబ్రవరి నెల రేపటితో సగం పూర్తవుతుంది. అయినా ఇంత వరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది లేదు.. ఉద్యోగుల విషయంలో సీఎం చెప్పింది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటి. స్వయంగా సీఎం హామీ ఇవ్వడం, సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆశల పల్లకిలో తేలియాడారు.
ఇక తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత 205 సంఘాలు జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్లను నెరవేర్చాలని సర్కారుకు అల్టిమేటం జారీ చేశాయి. మొత్తం 54 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 33 ఆర్థికేతర డిమాండ్లు కాగా, 21 డిమాండ్లు ఆర్థికపరమైనవి. ఆర్థికపరమైన డిమాండ్లను పక్కనపెట్టి తొలుత ఆర్థికేతర డిమాండ్లను అయినా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు కుతకుతలాడుతున్నారు. సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై రగిలిపోతున్నారు.