ములుగు, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) మావోయిస్టు అగ్రనేత ఆజాద్ పేరిట శనివారం లేఖ విడుదలైంది. ములుగు ఎస్పీ కనుసన్నల్లోనే ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నదని అందులో పేర్కొనడం జిల్లాలో కలకలం రేపింది.
బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పూజార్ కాంకేర్లో తెలంగాణ గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన పోరులో ముగ్గురు మావోయిస్టులు అమరులైనట్టు పేర్కొన్నది. ఎన్కౌంటర్కు ములుగు ఎస్పీ బాధ్యత వహించాలని హెచ్చరించింది. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి మావోయిస్టు పార్టీపై తన పోలీసు బలగాలతో దాడులు చేయిస్తూ రాజ్యహింసలో పాలించే వాళ్లంతా ఒకేగూటి పక్షులని రుజువు చేసుకున్నారని పేర్కొన్నది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో తమ కామ్రేడ్పై ములుగు ఎస్పీ ఈ ఎన్కౌంటర్కు పాల్పడ్డాడని ఆరోపించింది. తప్పకుండా ఈ ఎన్కౌంటర్కు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నది.