హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టు నేతలను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేసి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇటీవల మావోయిస్టు అగ్రనాయకులను ఎన్కౌంటర్ చేయడం బాధాకరమని అన్నారు. 20మంది మావోయిస్టు నేతలను పోలీసుల కస్టడీలో ఉన్నారని.. వాళ్లను కాల్చి చంపి ఎన్‌కౌంటర్లుగా ప్రకటించే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
సుధాకర్, సురేశ్ తదితరుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. దాయాది పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన మోదీ.. మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పీ సూర్యం, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐఎంల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.