హైదరాబాద్: వరుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న (Athram Lachanna), ఆత్రం అరుణ (Athram Aruna) పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోతున్నారు. 30 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉంటున్న లచ్చన్న.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా. ఇక ఆత్రం అరుణ బస్తర్లో డివిజన్ కమిటీ సెక్రెటరీగా ఉన్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు అనే పదం వినబడకుండా చేస్తాని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిన భద్రతా బలగాలు మావోయిస్టులు కనిపిస్తే చాలు అంతమొందిస్తున్నారు. ఈఏడాది ఇప్పటివరకు 357 మంది మావోయిస్టులు చనిపోయారు. అత్యధికంగా దండకారణ్యంలో 281 మందిని మట్టుబెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో లొంగిపోతున్నారు.
ఆపరేషన్ కగార్తో దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది 357 మంది మావోయిస్టులను జవాన్లు హత్య చేసినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గోండి మాండలికం, ఇంగ్లిషులో 24 పేజీల బుక్లెట్ను విడుదల చేసింది. వీరిలో 136 మంది మహిళలు, నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించింది. దండకార్యణంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశామని, 281 మంది మావోయిస్టులను కోల్పోయామని అందులో పేర్కొంది. హత్యకు గురైన తమ అనుచరుల జ్ఞాపకార్థం జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చారు.