ములుగు, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక లేఖలో పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్టు అధికారులు, పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులు, కేసుల బెదిరింపులతో గూడేలను ఖాళీ చేయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసీ బిడ్డ, మాజీ నక్సలైట్‌గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరమని అన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడడం లేదనేది అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌పై, 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పీసా చట్టంపై, 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎఫ్ఆర్ఏ, 1/70 చట్టాన్ని సీతక్క మరచిపోయిందా.. అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఆదివాసీలు, భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సందపను కాపాడుతున్న ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలను కాపాడుకోవడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఆదివాసీలు అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు, నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందరూ వారి హక్కుల అమలు కోసం అండగా ఉండాలని జగన్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.