కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 6: మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు సుధాకర్ మరణించిన 24 గంటల వ్యవధిలోనే మరో కీలక నేత ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమ్రంభీం-మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్జీ భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు.
దీంతో ఇరువర్గాల మధ్య పలుమార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి భాస్కర్ మృతదేహంతోపాటు ఒక ఏకే-47, ఇతర ఆయుధ, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.