కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 3 : ఆపరేషన్ ‘కగార్’లో స్వల్ప విరామం తర్వాత భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. గరియాబంద్ జిల్లా జుగాడ్ పోలీస్స్టేషన్ పరిధి మోటీపాని సమీప అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు జవాన్లపై కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు చేపట్టారు. దీంతో మావోయిస్టు పార్టీకి చెందిన మోస్ట్ వాంటెడ్, డివిజన్ కమిటీ మెంబర్ ఐతు అలియాస్ యోగేశ్ కోర్సా మృతి చెందినట్టు పోలీస్ అధికారులు భావిస్తున్నారు. యోగేశ్పై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతోపాటు వారికి చెందిన ఆయుధ, వస్తు, సామగ్రిని జవాన్లు స్వాధీనంచేసుకున్నారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ ‘కగార్’లో భాగంగా వారంరోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఆరుగురు మృతిచెందిన విషయం విదితమే. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలే టార్గెట్గా ఆపరేషన్ ‘కగార్’ దూసుకుపోతున్నట్టు తెలుస్తున్నది.