వరంగల్, హనుమకొండ : తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్, హనుమకొండ లో బంజారా ఆత్మీయ సమ్మేళనం, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ఐదు వందల జనాభా దాటిన 2వేల 471 గిరిజన తండాలను, ఆదివాసీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని వెల్లడించారు. ‘ మా గూడెంలో మా రాజ్యం- మా తండాలో మా పాలన’ కావాలనే గిరిజన ఆదివాసి బిడ్డల కలను సాకారం చేశారని అన్నారు. గిరిజన గ్రామ పంచాయతీల ఒక్కో భవనానికి రూ. 20 లక్షల చొప్పున రూ. 600 కోట్ల నిధులు మంజూరుచేశారని పేర్కొన్నారు.రోడ్డు కనెక్టివిటీ లేని గిరిజన అవాసాలకు బీటి రోడ్లను మంజూరు చేశారని వివరించారు.
గిరిజన విద్య కోసం తెలంగాణ రాష్టంలో 322 ఆశ్రమ పాఠశాల ద్వారా 88వేల 233 మంది పిల్లలకు పాఠశాల విద్యను, వసతిని అందిస్తున్నామని తెలిపారు. గిరిజన రిజర్వేషన్ పెంచినందు వల్ల గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ సీట్లు 3,195, మేడికల్ సీట్లు 189 లభిస్తాయని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 , ఇతర డిపార్ట్మెంట్ లలో సుమారు 903 పోస్టులు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా అధనంగా వస్తున్నాయని తెలిపారు.
గిరివికాసం ద్వారా..
‘ గిరివికాసం’ పథకం ద్వారా సాగుకు అనుకులంగా లేని భూములను సాగు భూములుగా మార్చేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 56 వేల 613 ఎకారాల భూమికి 98 కోట్ల 23 లక్షలు ఖర్చుచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పాలకుర్తిలో రూ. 2 కోట్లతో ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామని, ఎకరం స్థలంలో సేవలాల్ గుడి, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గిరిజనుల సంస్కృతిని, సంప్రదాయాలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, బంజారా సంఘాల నాయకులు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.