హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు వర్సిటీ వీసీ పోస్టులు ఈ నెలలోనే ఖాళీకానున్నాయి. 21న తొమ్మిది వర్సిటీల వీసీలు పదవీ విరమణ చేయనున్నారు. మూడేండ్ల గడువు పూర్తికానుండటంతో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు, జేఎన్టీయూ, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీలు తమ బాధ్యతల నుంచి వైదొలుగుతారు. ఇక తెలంగాణ వర్సిటీ వీసీని ఆయా పదవి నుంచి తొలగించగా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. వీసీల పదవీకాలం ముగియనుండటంతో గత జనవరిలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
మొత్తం పది వర్సిటీల వీసీ పోస్టులకు 1,382 దరఖాస్తులొచ్చాయి. 312 మంది ఆశావహులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు అందజేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ప్రభుత్వం ద్వారా గవర్నర్ పరిశీలకు పంపిస్తుంది. సెర్చ్ కమిటీలు వేయాల్సిన తరుణంలో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ ముగియనున్నది. పోలింగ్ ముగిసిన తర్వాత సెర్చ్ కమిటీ సమావేశాలను నిర్వహించాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరనున్నది. సెర్చ్ కమిటీ సమావేశాల నిర్వహణ, వీసీల నియామకానికి ఈసీ అనుమతి కోరనున్నట్టు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు ఈసీ అనుమతిస్తే ఈ నెల 21లోపు వీసీలను నియమించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నది. ఇది సాధ్యపడని పక్షంలో ఐఏఎస్ అధికారులను ఇన్చార్జి వీసీలుగా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నది.