SCR | సికింద్రాబాద్, జూన్ 18: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆదివారం ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 19 నుంచి 25 వరకు ఈ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
వారంపాటు 25 రైళ్లను రద్దు చేయగా, ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్-బోధన్ రైలు సమయంలో తాత్కాలిక మార్పులు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు సేవలందించే 23 ఎంఎంటీఎస్ ట్రైన్లను సోమవారం నుంచి ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.