హైదరాబాద్, ఆగస్టు12 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల మంజూరుకు ఏండ్లు! ఆ తర్వాత సర్వేకోసం మరికొన్నేండ్లు! శంకుస్థాపనకు ఇంకొన్ని సంవత్సరాలు! ఆ తర్వాతైనా పనులు పూర్తవుతాయా? అంటే అదీ లేదు! అనుమతుల మాటంటారా.. ఆ ఊసన్నదే ఉండదు! ఎక్కడివక్కడే పెండింగ్! దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల దుస్థితి ఇది! సూటిగా చెప్పాలంటే పెండింగ్ అనే పదానికే కాంగ్రెస్ జమానా చిరునామా! నీళ్లు, నిధులు, నిమామకాల నినాదంతో తెలంగాణను సాధించి పాలనా పగ్గాలు చేపట్టాక, మొట్టమొదటి నినాదమైన నీళ్లను రైతులకు అందించి మన భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్ జమానాలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. నిర్దేశిత గడువు, నిర్ణీత సమయానికి పూర్తయి సాగునీటి ఫలాలను రైతాంగానికి అందించాయి. ఏకకాలంలోనే పలు మేజర్ ప్రాజెక్టుల అనుమతులను కూడా సాధించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది.
ఎన్నో ప్రాజెక్టులు ఏండ్ల తరబడి..
కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల పనులన్నీ ఏండ్ల తరబడి కొనసాగాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ప్రాజెక్టుల సర్వే కోసం 1984లో జీవో జారీ చేయగా, ఐదేండ్ల తర్వాత సర్వే కోసం సరిల్ కార్యాలయం ఏర్పాటైంది. 1997లో సర్వే కోసం రూ.50 లక్షలు మంజూరు కాగా, 1999లో పరిపాలనా అనుమతులు వచ్చాయి. 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తయి టీడీపీ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ప్రాజెక్టు సర్వేకు 1984 జీవో జారీ చేస్తే 20 ఏండ్ల తర్వాత ఎన్నికల ముందు, తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పనులు పూర్తి చేయలేదు. నిధుల కొరత, భూసేకరణ, అటవీ అనుమతులు, రైల్వే, రోడ్డు క్రాసింగ్, అంతర్రాష్ట్ర వివాదాలు, కాంట్రాక్టు సంస్థలతో వివాదాలు, కోర్టు కేసులు తదితర సాకులతో ప్రాజెక్టులను మూలకునెట్టింది. ఎత్తిపోతల పథకాల్లో సంక్లిష్టమైన పంప్‌హౌస్, సర్జ్పూల్ల నిర్మాణం, పంపులు, మోటర్లను బిగింపు, విద్యుత్ సరఫరా సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ కాలువలకు కావాల్సిన భూసేకరణ సైతం పూర్తి చేయలేదు. రెండు ప్రాజెక్టులే కాకుండా కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ స్టేజ్-2, వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతలు ఇలా చెప్పుకొంటూ పోతే పూర్తికాని ప్రాజెక్టులు కోకొళ్లలుగా ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో చకచకా..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సారథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. ఇంజినీరింగ్ నిపుణులతో కూలంకషంగా సమీక్షించి సమస్యలు పరిషరించారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ నిరంతర పర్యవేక్షణతో ప్రాధాన్యత క్రమంలో నిధులు సమకూర్చుతూ, అనుమతులను సత్వరమే జారీ చేస్తూ పనులను పరుగులు పెట్టించారు. కేవలం రెండేళ్లలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టు పనులను 50శాతం నుంచి 95 శాతం పూర్తిచేశారంటే కేసీఆర్ అకుంఠిత దీక్షను అర్థం చేసుకోవచ్చు. 2016-17లో కల్వకుర్తి ద్వారా 3.07 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షలు, భీమా ద్వారా 1.58 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ద్వారా 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు.. మొత్తం నాలుగు ఎత్తిపోతల పథకాల ద్వారా 5 లక్షల ఎకరాలకు తొలిసారిగా సాగునీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతంది.
క్రమంగా డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేస్తూ నేడు ప్రాజెక్టుల కింద నికరంగా 10లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి కేవలం 11నెలల వ్యవధిలోనే పూర్తిచేశారు. బృహత్తర పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడమే కాకుండా ప్రధాన పనులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. గోదావరి బేసిన్లోనూ మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. వరద కాలువ సజీవజలధారగా మారింది. బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్ల కనిష్ఠ సమయంలోనే కేసీఆర్ సర్కార్ పూర్తిచేసింది. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టును 10నెలల్లోనే పూర్తిచేశారు. సీతారామ ప్రాజెక్టు పనులన్నీ పూర్తిచేసి ట్రయల్న్‌క్రు సిద్ధం చేసిపెట్టారు. అనుమతులు సైతం ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయి. ఇవీగాక దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులుగా ముద్ర వేసుకున్న అనేక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.
11