హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘సొమ్ము ఒకరిదైతే.. సోకు మరొకరిది.. అన్న చందంగా ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ భూముల పరిస్థితి. పాత విధానంలో భూ హక్కదారులు ఒకరుంటే.. అనుభవదారుడు మరొకరు ఉండేవారు. గత పాలనలో కొనసాగిన భూ రికార్డుల విధానాల వల్ల రైతులకు సంబంధించిన అనేక భూములు కబ్జాలకు గురయ్యాయి’ అని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సత్యనారాయణ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌తో భూముల విషయంలో పారదర్శకత ఏర్పడిందని చెప్పారు. మళ్లీ పాత విధానం అమలులోకి వస్తే భూకబ్జాలు కూడా జోరందుకుంటాయని ఆందోళన వ్యక్తంచేశారు. ధరణి పోర్టల్‌తో రైతులకు తమ భూములపై భరోసా ఏర్పడిందని ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు.
ధరణిలో పేరు ఉంటే భూములు కబ్జా కావు అన్న భరోసా వచ్చింది. వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు ఉన్న వారి పేర్లన్నీ ఈ పోర్టల్‌లోకి వచ్చాయి. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
భూ యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయో.. వారి బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు పథకం డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో రైతుబంధు పథకం పగడ్బందీగా అమలవుతున్నది. కబ్జాలు చేస్తున్న వారికి మాత్రం ధరణి పోర్టల్ ఇబ్బందిగానే మారింది’ అని సత్యనారాయణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతికి ఇస్తున్న ప్రాధాన్యంలో వ్యవసాయ రంగం మొదటి స్థానం లో ఉందని సత్యనారాయణ అన్నారు.