హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఒకరు ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ఆ ఒకరే రాష్ట్ర ప్రభుత్వమైతే! అందునా కాంగ్రెస్ సర్కారు అయితే!! పదేపదే.. నిలువునా మోసం చేయొచ్చని మరోసారి రుజువైంది.
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రజా ప్రయోజనాల కోసం తమ భూములు ఇచ్చిన రైతులను ఆయా ప్రభుత్వాలు నెత్తిన పెట్టుకొని చూసుకుంటాయి. నిబంధనలు ఎలా ఉన్నా.. పరిహారం రూపాయి ఎక్కువిచ్చి వాళ్లను త్యాగధనులుగా కొనియాడుతాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు కడుపు నిండా పరిహారం ఇవ్వడమే కాదు.. ఆ తర్వాత కూడా వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పించిన చరిత్ర ఉన్నది. కానీ గ్రీన్ ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన త్యాగధనులను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా మోసం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాటను తుంగలో తొక్కడం ఒకవంతైతే.. అధికారం దక్కిన తర్వాత కనీసం నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారంతోనూ పరిహాసమాడుతున్నది. ఓవైపు అధికార పార్టీ నేతలే పరిహారం ప్లాట్లతో భూ దందా చేసి అమాయక రైతులను బురిడీ కొట్టిస్తుంటే.. మరోవైపు రైతుల ప్లాట్లలోంచి ప్రభుత్వం ఏకంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్నే చేపడుతున్నది. ఇంకోవైపు రైతులకు హక్కుభుక్తంగా దక్కాల్సిన పరిహారం ప్లాట్ల పంపిణీ ఆర్భాటంగా.. అరకొరగా చేసి చేతులు దులుపుకొన్న అధికారులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన రైతులకు వాళ్ల ప్లాట్లు ఎక్కడున్నాయో నేటిదాకా అప్పగించలేదు.
అమాయక రైతులతో చెడుగుడు
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 19,400 ఎకరాల భూములను సేకరించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం ఆ మేరకు భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 14 వేల ఎకరాలకు పైగా భూములను సేకరించింది. పరిహారంగా పట్టా భూమికి రూ.16.50 లక్షలు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.8.50 లక్షల వరకు నగదు పరిహారం చెల్లించింది. మీర్ఖాన్పేటలో 1,400 ఎకరాల భూమిని సేకరించింది. 560 ఎకరాల్లో భారీ లే అవుట్‌ను రూపొందించింది. ఎకరాకు అభివృద్ధి చేసిన 121 చదరపు గజాల ఇంటి స్థలాన్ని 5,720 మంది రైతులకు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పొజిషన్ ఇవ్వడం వాయిదా పడింది.
పరిహారం ప్లాట్ల వెనుక ఏం జరుగుతున్నది?!
ఐదెకరాలు పైబడి భూములు కోల్పోయిన వేలాది మంది రైతులకు ఇప్పటికీ అధికారులు ప్లాట్లు కేటాయించడం లేదు. వీరికి సంబంధించిన ప్లాట్లన్నీ 600 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు కావడం గమనార్హం. సాధారణంగా ప్రైవేట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లతో పాటు 59 జీవో కింద తహసీల్దారు రిజిస్ట్రేషన్లు చేసినా రెండు, మూడు రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్లు కొనుగోలుదారుకు డాక్యుమెంట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు తీసుకోవడం.. వాటిని బీరువాల్లో ఉంచడం వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలు అనధికారికంగా కొనుగోళ్లు చేయడానికి దీనికేమైనా లింకు ఉన్నదా? అనే ఆందోళన కూడా రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. రెండేండ్లుగా పరిహారం ప్లాట్లు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వం.. ఆ లేఅవుట్ నుంచే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ అధికారులు కనీసం ఆ రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కూడా చూపించడం లేదు.
భూ దందాపై ‘నమస్తే’ కథనంతో అధికారుల హడావుడి
పరిహారం ప్లాట్లను బాధిత రైతులకు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం వెనుక తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన వేదికకు చేరువలోనే పరిహారం ప్లాట్ల లే అవుట్ ఉన్నది. అక్కడ చదరపు గజం ధర కనీసంగా రూ.30-35 వేల దాకా పలుకుతున్నది. ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. తమకు విక్రయిస్తే ఎంతో కొంత ఇస్తామని ఆశ చూపారు. దీంతో కొందరు రైతులు అడ్డికి పావుసేరులా ప్లాట్లను అనధికారికంగా విక్రయించారు. నోటరీలతో కాంగ్రెస్ నేతలు ఆ ప్లాట్లను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఈ భూ దందాను వెలుగులోకి తేవడంతో ఆర్నెల్ల కిందట అధికారులు హడావుడి చేశారు. లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లు కేటాయించారు. రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఐదు ఎకరాల వరకు భూములు కోల్పోయిన వేలాది మంది రైతులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. మిగిలిన వారికి కాలేదు.