హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ), ఇస్రో ఆధ్వర్యంలో పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఎత్తయిన ప్రదేశాల్లో పరిశోధనల కోసం శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లగల బెలూన్లను ఈ నెల రెండోవారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీవరకు ఆకాశంలోకి పంపనున్నట్టు టీఐఎఫ్ఆర్ ఇన్చార్జి సైంటిస్ట్ సునీల్‌కుమార్ గురువారం తెలిపారు.
బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, ఈసీఐఎల్ నుంచి విడతలవారీగా 10 బెలూన్లను ప్రయోగించనున్నట్టు వెల్లడించారు. సన్నని (పాలిథిలిన్) ప్లాస్టిక్ ఫిల్మ్‌లతో దాదాపు 50 నుంచి 85 మీటర్ల వ్యాసార్థం ఉండి, హైడ్రోజన్ నింపిన బెలూన్ విమానాలను రాత్రి 8నుంచి ఉదయం 6.30మధ్య ప్రయోగించనున్నట్టు వివరించారు. ఆ బెలూ న్లు 30 నుంచి 42 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొంటాయని చెప్పారు. దాదాపు 10 గంటలపాటు ఆయా ఎత్తులలో నిలకడగా ఉండి, తర్వాత కిందకు వస్తాయని పేర్కొన్నారు.
350 కిలోమీటర్ల పరిధిలో నేలకు: బెలూన్లు భూమికి తిరిగి వచ్చే క్రమంలో హైదరాబాద్‌కు 200 నుంచి 350 కిలోమీటర్ల దూరంలో అవి ల్యాండయ్యే అవకాశమున్నదని సునీల్‌కుమార్ తెలిపారు. విశాఖపట్టణం-హైదరాబాద్-షోలాపూర్ లైన్లో ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీమ్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మలాజిగిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బెలూన్ విమానాలు నెమ్మదిగా ల్యాండయ్యే అవకాశమున్నదని చెప్పారు.
ఆ పారాచూట్, బెలూన్ విమాన పరికరాలను ఎవరైనా గుర్తిస్తే, వాటిని ల్యాండింగ్ స్థలం నుంచి తొలగించవద్దని కోరారు. వాటి సమాచారాన్ని వెంటనే తమకు అందించాలని, లేదంటే సమీపంలోని పోలీస్‌స్టేషన్, పోస్ట్ ఆఫీస్, జిల్లా అధికారులకు తెలియజేయాలని అభ్యర్థించారు. సమాచారం ఇచ్చినవారికి రివార్డు కూడా ఇస్తామని చెప్పారు. బెలూన్ విమానాల్లోని పరికరాలు చాలా సున్నితంగా ఉంటాయని, వాటిని తాకితే శాస్త్రీయ డాటా పోతుందని వెల్లడించారు. అదీగాక బెలూన్లోని కొన్ని పరికరాలపై అధిక వోల్టేజీ పవర్ ఉండే అవకాశమున్నదని, వాటిని తాకడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.