e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home తెలంగాణ ప్రతి ఇంచు పక్కాగా..

ప్రతి ఇంచు పక్కాగా..

ప్రతి ఇంచు పక్కాగా..
  • కోఆర్డినేట్ల నిర్ధారణతో వివాదాలకు చెక్‌
  • సమగ్ర డిజిటల్‌ సర్వేతో ఎన్నో లాభాలు
  • కచ్చితంగా తేలనున్న లెక్కలు.. హద్దులు

హైదరాబాద్‌, జూన్‌ 2 (నమస్తే తెలంగాణ): భూ వివాదాలు లేని తెలంగాణను ఆవిష్కరించాలన్నది సీఎం కేసీఆర్‌ కల. ఈ క్రమంలో ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ తొలిగింపు, విచక్షణాధికారాల కత్తిరింపు, ధరణి పోర్టల్‌ వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని భూములన్నింటినీ డిజిటల్‌ సర్వేచేయాలని నిర్ణయయించారు. ఈ నెల 11 నుంచి పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో భూములు కొలిచే విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఒకప్పుడు గొలుసు పద్ధతిలో భూములు కొలిచేవారు. దీనివల్ల కచ్చితత్వం తక్కువ. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నది. ఇప్పుడు భూములను రెండు పద్ధతుల్లో కొలుస్తున్నారు.

1) ఫీల్డ్‌ సర్వే.. ఈ విధానంలో సర్వే సిబ్బంది సరిహద్దుల చుట్టూ తిరిగి డిజిటల్‌ పరికరాలతో సర్వేచేస్తారు. ఇందులో డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) ను ఉత్తమ పద్ధతిగా భావిస్తారు.
2) ఏరియల్‌ సర్వే.. ఈ విధానంలో డ్రోన్‌ లేదా మానవ రహిత విమానాలను (యుఏవీ) ఉపయోగించి నిర్ణీత ప్రాంతం డిజిటల్‌ మ్యాప్‌లను రూపొందిస్తారు.
ఫీల్డ్‌ సర్వేలో డీజీపీఎస్‌ ఉత్తమం..
సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి చేసే ఫీల్డ్‌ సర్వేలో ప్రస్తుతం డీజీపీఎస్‌ విధానం ఉత్తమమైనది. దీనికి ప్రధానంగా మూడు పరికరాలు ఉంటాయి. 1) రిఫరెన్స్‌స్టేషన్‌ (బేస్‌) 2) రోవర్‌ 3) రిమోట్‌.. వీటితోనే ఒక పొలం డిజిటల్‌ మ్యాప్‌ లేదా ఫైల్‌ను రెండు దశల్లో తయారుచేస్తారు. రిఫరెన్స్‌ స్టేషన్‌ లేదా బేస్‌ వద్ద ఒక వ్యక్తి కాపలా ఉండాలి. ఒకవేళ బేస్‌ సురక్షిత ప్రాంతంలో ఉంటే అవసరం లేదు. రోవర్‌ కోసం ఒకరు, రిమోట్‌ కోసం ఒకరు, వివరాల నమోదుకు మరొకరు ఫీల్డ్‌లో అవసరం. ఈ వివరాలన్నింటినీ ప్రాసెస్‌ చేయడానికి ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ కావాలి. మొత్తంగా నలుగురుంటే ఒక పొలం డిజిటల్‌ మ్యాప్‌ రూపొందించవచ్చు. బేస్‌ లేదా రిఫరెన్స్‌ స్టేషన్‌ పరిధి కనిష్ఠంగా 3 కి.మీ.లు. ఒక ప్రాంతంలో బేస్‌ అమర్చి 3 కి.మీ. పరిధిలో ఏ పొలాన్నయినా కొలువచ్చు. ఒక బేస్‌కు 4 రోవర్లు అనుసంధానం చేయవచ్చు. అంటే ఒకేసారి 4 బృందాలు పనిచేయవచ్చు.
నెలకు మూడు గ్రామాలు పూర్తి!
బేస్‌ను బిగించడానికి 15-30 నిమిషాలు, ఒక్కో కోఆర్డినేట్‌ పాయింట్‌ను నమోదు చేయడానికి 30 సెకన్ల నుంచి ఒక నిమిషం సమయం పడుతుంది. రోవర్‌ను పట్టుకొన్న వ్యక్తి సరిహద్దుల వెంట నడువడానికే ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఆ తర్వాత కంప్యూటర్‌లో ఈ సమాచారాన్ని క్రోడీకరించడానికి ఒకటి నుంచి ఒకటిన్నర రోజు పడుతుంది. క్షేత్రస్థాయి బృందాలు, కంప్యూటర్‌ నిపుణులు ఒకే సమయంలో పనిచేస్తే మరింత సులభమవుతుంది. మొత్తంగా 1500 ఎకరాలున్న ఒక గ్రామాన్ని 5-7 రోజుల్లో సర్వే చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు.
డ్రోన్‌/యూఏవీ సర్వే
భూముల కొలతలో మానవ ప్రమేయం అతి తక్కువగా ఉంటూ.. కచ్చితత్వం ఎక్కువగా ఉండే విధానమిది. ఇందులో డ్రోన్లు లేదా యూఏవీలను వాడుతారు. వీటికి ఆర్జీబీ లేదా మల్టీ స్పెక్ట్రల్‌ కెమెరాలు, లైడార్‌ పరికరాలు, డౌన్‌వర్డ్‌ ఫేసింగ్‌ సెన్సర్లు వంటివి బిగించి ఉంటాయి. దీనిని మొబైల్‌ లేదా ట్యాబ్‌ ద్వారా నియంత్రిస్తారు.
ముందుగా ఆపరేటర్‌.. డ్రోన్‌ను గాలిలోకి ఎగిరేలా చేస్తారు. కొలువాల్సిన ప్రాంతంపై (ప్రాజెక్ట్‌ ఏరియా) పలుమార్లు తిప్పుతారు. ఈ సమయంలో డ్రోన్‌లోని కెమెరాలు వందల సంఖ్యలో ఉపరితలం ఫొటోలను తీస్తాయి. కొన్ని కెమెరాలు ఒక సెంటీమీటర్‌ రెజల్యూషన్‌తో ఫొటోలు తీస్తాయి. ఆ సమయంలోనే డ్రోన్‌.. ఆ ప్రాంతం అక్షాంశ, రేఖాంశాలు (కో-ఆర్డినేట్స్‌) నమోదు చేస్తుంది. ఈ సమాచారం మొత్తాన్ని టోపోగ్రఫిక్‌డాటా అంటారు.
ప్రాజెక్ట్‌ ఏరియా ఫొటోలను, సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో అనేక రూపాల్లోకి మార్చుతారు. అన్ని ఫొటోలను, కోఆర్డినేట్స్‌తో పాటు జతచేస్తూ ‘ఆర్థో మొజాయిక్‌ మ్యాప్స్‌’ను తయారుచేస్తారు. ఇది 2డీ రూపంలో ప్రస్తుతం మనం వాడే గూగుల్‌ మ్యాప్స్‌ మాదిరిగా ఉంటుంది. అంతేకాకుండా.. ఆ ప్రాంతం ‘3డీ’ మోడల్స్‌ కూడా తయారుచేస్తారు. వీటితోపాటు డిజిటల్‌ సర్ఫేస్‌ మోడల్స్‌ (డీఎస్‌ఎం), డిజిటల్‌ టెరిటెరేన్‌ మోడల్‌ (డీటీఎం) వంటి మ్యాప్‌లను తయారుచేస్తారు.
మొదటి దశ..
భూమిని కొలువాలనుకొన్న చోట ఎత్తయిన ప్రాంతంలో బేస్‌ను అమర్చుతారు. దీనికి రోవర్‌ను అనుసంధానిస్తారు. రోవర్‌ అనేది యాంటెన్నా మాదిరి ఉంటుంది. ఈ రెండు పరికరాలు శాటిలైట్‌తో అనుసంధానమై ఉంటాయి. ఒక వ్యక్తి రోవర్‌ను పట్టుకొని.. కొలువాలనుకొన్న పొలం సరిహద్దుల వెంట నడుస్తారు. పొలానికి ఉన్న మూల (కార్నర్‌)కు వెళ్లిన తర్వాత రిమోట్‌ను క్లిక్‌ చేస్తే ఆ కోఆర్డినేట్‌ పాయింట్‌ (అక్షాంశ, రేఖాంశాలు) నమోదవుతుంది. ఇలా అన్ని మూలల్లో కోఆర్డినేట్స్‌ నమోదుచేస్తారు. ఈ పాయింట్లన్నింటినీ కలుపుతూ చిత్రాన్ని గీస్తే అదే పొలం డిజిటల్‌ మ్యాప్‌. ఈ డాటా బేస్‌లో నిక్షిప్తం అవుతుంది. అదే సమయంలో మరోవ్యక్తి కాగితంపై కోఆర్డినేట్‌ పాయింట్స్‌, ఎవరెవరితో సరిహద్దులు పంచుకొంటున్నారు? వంటి వివరాలను నమోదు చేస్తారు.
రెండో దశ..
బేస్‌లోని సమాచారాన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తంచేస్తారు. దానిని ఆటోక్యాడ్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ల సాయంతో ప్రాసెస్‌ చేస్తారు. కోఆర్డినేట్స్‌ అన్నింటినీ కలుపుతూ చిత్రాన్ని గీస్తారు. పొలం మూలలు ఏయే అక్షాంశాలు, రేఖాంశాల వద్ద ఉన్నాయో వివరిస్తూ ప్రొఫైల్‌ తయారుచేస్తారు. యజమాని పేరు, పొలం కొలతలు, సరిహద్దులు ఎవరెవరితో పంచుకుంటున్నారు.. వంటి వివరాలు నమోదుచేస్తారు. దీంతో పొలం డిజిటల్‌ ఫైల్‌ తయారవుతుంది.
ఎన్నో లాభాలు
ఫీల్డ్‌ సర్వే కన్నా 5 రెట్లు వేగంగా.. తక్కువ సిబ్బందితోనే పూర్తి చేయవచ్చు.
ఒక్క ఇంచు తేడా రాకుండా కొలువచ్చు. జియోట్యాగింగ్‌తో ఆ వివరాలను మార్చే వీలుండదు.
ఈ సమాచారన్ని ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు.
డ్రోన్‌ సర్వే సమాచారంతో ఒక ప్రాంతం ఎత్తు పల్లాలను కొలువచ్చు. 3 డీ మ్యాప్‌ల సాయంతో కొండలు, గుట్టల ఎత్తులను కొలువచ్చు. ఈ డాటా వ్యవసాయం, నీటిపారుదల, రోడ్లు భవనాలు.. తదితర శాఖలకు ఎంతో ఉపయోగం.
డ్రోన్‌ ఫొటోల ద్వారా జలవనరులు, ఇండ్లు, రోడ్లు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో కనుక్కోవచ్చు. అర్బన్‌ ప్లానింగ్‌లో ఉపయోగపడుతుంది.
డ్రోన్‌ సర్వేతో నెలకు ఐదారు గ్రామాలను సులభంగా మ్యాపింగ్‌ చేయవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి ఇంచు పక్కాగా..

ట్రెండింగ్‌

Advertisement