మంచిర్యాల : మంచిర్యాల( Mancherial) జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట( Shanigakunta )మత్తడి బ్లాస్టింగ్ (Mattadi blasting) కేసులో ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నూర్ శనిగకుంట మత్తడి పేల్చివేసిన ఘటనలో మరికొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను శుక్రవారం వేకువజామున పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొడిసెల బాపు రెడ్డి,పెద్దింటి శ్రీనివాస్‌ను సైతం అరెస్టు చేశారు.
అయితే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గొడవ చేయడంతో అరెస్ట్ చేసిన వారిని పోలీసులు వదిలేశారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు వదిలిపెట్టారు అనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ నెల 16న శనిగకుంట చెరువు మత్తడిని కొందరు పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు.
చెన్నూర్ నీటి పారుదల శాఖ ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 20న అనుమానితులు పెండ్యాల లక్ష్మీనారాయణ (లక్ష్మణ్), భీం మధుకర్, రసమల్ల శ్రీనివాస్‌ను విచారించారు. గోగుల దానయ్యతో కలిసి నేరం చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకున్నారు. దానయ్య వద్ద ఉన్న కంప్రెషర్ డ్రిల్ మిషన్ ట్రాక్టర్, నాలుగు జిలెటిన్ స్టిక్స్, జీఐ వైరును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.