నవ భారత నిర్మాత, దార్శనికుడు, అసలైన మేధావి, దయాహృదయుడు మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర దయ, కృతజ్ఞతతో ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన స్నేహితులు, కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన గొప్పదనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. రెస్ట్ ఇన్ పీస్ సర్! – కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దని నాడు వెన్నుతట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మననం చేసుకున్నారు. ‘మీ డిమాండ్, కోరికలో న్యాయం ఉన్నది. మీ ఆశయం తప్పక ఫలిస్తుంది’ అని ప్రత్యేక రాష్ర్టాన్ని కాంక్షించిన నాయకుడు మన్మోహన్సింగ్ అని కొనియాడారు. శుక్రవారం ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్ రావు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్‌తో చాలా సాన్నిహిత్యం ఉండేది. ఏడాదిన్నర పాటు వారి క్యాబినెట్లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో చాలా ఆప్యాయంగా పలకరించేవారు. తెలంగాణ ఎలా ఉన్నదని ఎప్పటికప్పుడు వాకబు చేసేవారు.
ఎన్నో విషయాల్లో కేసీఆర్‌కు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం 2004లో కేసీఆర్ ఆయన క్యాబినెట్లో చేరిన తర్వాత.. కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా ‘మీరు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దు’ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ‘మీ డిమాండ్, కోరికలో న్యాయం ఉన్నది. మీ ఆశయం ఫలిస్తుంది. ఫలించాలి అని తెలంగాణను కాంక్షించిన నాయకుడు మన్మోహన్ సింగ్. భారత దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటమే కాకుండా.. మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఒక సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, అందరివాడుగా భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్’ అని కొనియాడారు. ‘ఆయనకు మా పార్టీ తరఫున నివాళి అర్పించాలని పార్టీ పెద్దలు కేసీఆర్ చెప్పారు. రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ తదితరులతో కలిసి వారి కుటుంబసభ్యులను కలిశాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాం. ఇలాంటి మహానుభావుడిని కోల్పోవడం దురదృష్టకరం. దేశంలో అధికారం మారుతూ ఉండొచ్చు.. కానీ దేశం మంచిగా ఉండాలని కాంక్షించే వారు చనిపోవడం అత్యంత బాధాకరం. వారి కుటుంబానికి దేవుడు మనో నిబ్బరం కలుగజేయాలని మా ప్రార్థన. వారి మృతిపట్ల మా బీఆర్ఎస్ పార్టీ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నది’ అని పేర్కొన్నారు.
రెస్ట్ ఇన్ పీస్ సర్..
‘నవ భారత నిర్మాత, దార్శనికుడు, అసలైన మేధావి, దయాహృదయుడు మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర దయ, కృతజ్ఞతతో ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన స్నేహితులు, కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన గొప్పదనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. రెస్ట్ ఇన్ పీస్ సర్’ అంటూ ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్ట్ చేశారు.