రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికపై ఒగ్గుడోలు కళను ప్రదర్శించాలని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చౌదరిపల్లి రవికుమార్ బృందానికి కేంద్ర సాంస్కృతికశాఖ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఓ మారుమూల గ్రామానికి చెందిన కళాకారులకు తొలిసారి ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన చేసే అవకాశం రావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఒగ్గుడోలుకు ప్రసిద్ధిగాంచిన చుక్క సత్తయ్య అంతరించిపోతున్న కళకు జీవం పోసి అంతర్జాతీయ గుర్తింపుతెచ్చాడు. సత్తయ్య వారసత్వాన్ని వరుసకు మనుమడైన రవికుమార్ పుణికిపుచ్చుకుని ఒగ్గుడోలుకు మరో అరుదైన గౌరవం దక్కేలా చేశారు. సత్తయ్య కథకు డోలు విన్యాసాన్ని జతచేసి ఆయన వెంట అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.