Calcium Carbide | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): వేసవికాలంలో సహజ సిద్ధంగా దొరికే మామిడిపండ్లను కొందరు వ్యాపారులు వివిధ రసాయనాలతో మగ్గపెడుతున్నారు. ఫలితంగా పలు వ్యాధులు సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మామిడిపండ్లు తొందరగా పండటానికి క్యాల్షియం కార్బైడ్(కార్సినోజెన్) వంటి రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారని దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.
అయితే జాగ్రత్తగా గమనిస్తే రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లకు, సహాజ సిద్ధంగా పండిన వాటికి తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పండ్ల రంగు, వాసనల వల్ల కూడా వాటిలో తేడాను గమనించవచ్చునని పేర్కొంటున్నారు. దీనిని గమనించి మార్కెట్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా కొనుగోలు చేసిన పండ్లను తీనేముందు వేడినీటిలో కొంతసేపు ఉంచిన తర్వాత దానిని తినాలని పేర్కొంటున్నారు.