హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4, (నమస్తే తెలంగాణ): పెట్టుబడి పేరుతో మోసం చేసిన మానేశ్కుమార్శర్మ అనే నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అతడిపై దేశవ్యాప్తంగా 114 కేసులు నమోదు కాగా, వాటిలో 22 కేసులు తెలంగాణకు సంబంధించినవే ఉన్నాయని పోలీసులు తెలిపారు. ‘కోస్తా వెల్ గ్రోన్’ అనే ఫేక్ యాప్ ద్వారా అధిక లాభాల పేరుతో హైదరాబాద్ వ్యక్తి నుంచి నిందితుడు రూ. 6.16 లక్షలు వసూలు చేశాడు. మొదట కొన్ని లాభాలు ఆశ చూపి, తర్వాత విత్‌డ్రా ఆపివేయడం, టెలిగ్రాం, వాట్సాప్ ద్వారా టార్గెట్ చేయడం, ఫార్వర్డ్ ఎస్ఎంఎస్ అనే ఏపీకే అకౌంట్లను పంపించడం వంటి మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
పాలిసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల సీట్ల కేటాయింపులో గందరగోళం నెలకొన్నది. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మొదటి విడత సీట్లను కేటాయించాల్సి ఉంది. కానీ శుక్రవారం రాత్రి 9గం టల వరకు సీట్లను కేటాయించలేదు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో.. తెలియక ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు అలాట్మెంట్ చేస్తా రో తెలియక విద్యార్థులు తరచూ చెక్‌చేసుకోవడం కనిపించింది. ఇదే అంశంపై ఆరా తీసేందుకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య, ప్రవేశాల క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో ఆరా తీసేందుకు ప్రయత్నించగా, వారు స్పందించలేదు.