దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి
149 కోట్ల వ్యయం.. లోడ్ టెస్టు సక్సెస్
పదోవంతుకు తగ్గనున్న 72 కి.మీ. దూరం
ప్రారంభానికి ముందే జాతీయ పురస్కారం
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మానేరు నదిపై నిర్మిస్తున్న కరీంనగర్ తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ఇదే కాగా, ప్రారంభానికి ముందే ఈ నిర్మాణానికి పలు పురస్కారాలు దక్కుతున్నాయి. 2021 సంవత్సరానికిగాను ఔట్‌స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్‌గా జాతీయ అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్‌లోని ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 149 కోట్లతో చేపడుతున్న ఈ బ్రిడ్జి నిర్మాణంలో అనేక విశేషాలున్నాయి. రాష్ట్రంలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తొలి కేబుల్ బ్రిడ్జి ఇదే. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వెయ్యి టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రదర్శించేందుకు వీలుగా రూ.8కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత.
72 నుంచి 7 కిలోమీటర్లకు తగ్గనున్న దూరం
కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్ వెళ్లాల్సిన వాహనాలన్నీ అలుగునూర్ బ్రిడ్జిపై నుంచే వెళ్లాల్సి వస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌పెట్టాలంటే వరంగల్ వైపునకు ప్రత్యేక రోడ్డును నిర్మించడమే పరిష్కారమని ప్రభుత్వం భావించింది. కరీంనగర్-సదాశివపల్లి మధ్య ఉన్న పాత వరంగల్ రోడ్డుపై రూ.149 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని 2018లో చేపట్టారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ పూర్తయితే కరీంనగర్- వరంగల్ రూట్లో 72 కిలోమీటర్ల దూరం 7 కిలోమీటర్లకు తగ్గనుంది. ఇప్పటికే బ్రిడ్జిపై లోడ్ టెస్టును అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఒక్కో ఇసుక టిప్పరు 30టన్నుల బరువుండేలా మొత్తం 28 టిప్పర్లను వంతెనకు ఇరువైపులా నిలిపి ఉంచారు. మొత్తం 840 టన్నుల ఇసుకబరువుతోపాటు ఫుట్‌పాత్‌లపై మరో 110 టన్నుల ఇసుక సంచులను వేసి 24 గంటలపాటు వంతెన సామర్థ్యాన్ని పరీక్షించారు. సోమ, మంగళవారాల్లో మరోసారి లోడ్ టెస్టు చేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్లనిర్మాణ పనులతోపాటు అనుసంధాన రోడ్ల పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. ఇందుకోసం రూ. 34 కోట్లతో విశాలమైన రోడ్లను ఆర్అండ్బీ అధికారులు నిర్మించనున్నారు.