కాశీబుగ్గ/జనగామ చౌరస్తా, జూలై 29 : దివ్యాంగులు, వృద్ధుల పింఛన్‌ను పెంచపకోతే ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మంగళవారం వరంగల్ 14వ డివిజన్, జనగామ జిల్లా కేంద్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతు పెన్షన్‌దారుల సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతుల పెన్షన్ రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచి, కండరాల క్షీణత, ఇతర తీవ్రమైన రోగులకు రూ.15వేలను ఏపీలో మాదిరిగా పెంచాలని, ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు మొదటి వారంలోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 13న హైదరాబాద్‌లో లక్షలాది మందితో మహాగర్జన సభ నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.