కొడంగల్, ఆగస్టు 2: పెంచిన పెన్షన్ అందిస్తావా.. లేక గద్దె దిగుతావో తేల్చాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సవా ల్ విసిరారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, కండరాల క్షీణత బాధితులకు పెంచి అందిస్తామన్న పెన్షన్ సాధించే దిశగా తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఏర్పడిందని పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పెన్షన్, కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు, వీహెచ్పీఎస్ నాయకులతో మినీ మహాగర్జన సమావేశాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్ట్టోలో దివ్యాంగులకు రూ. 6వేలు, వృద్ధ్దులు, వితంతులు, చేయూత పెన్షన్ దారులకు రూ. 4వేలు తీవ్ర వైకల్యం కలిగినవారికి రూ.15వేలు పెంచి ఇస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి 20నెలలు గడుస్తున్నప్పటికీ పెంచిన పెన్షన్‌ను అందించకుండా రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
పెంచిన పెన్షన్ ఎప్పుడు అమలు అవుతుందని, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని 50లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. గత 20 నెలలుగా పెంచిన పెన్షన్ బకాయి డబ్బులు రూ.20వేల కోట్లు ఎక్కడిపోయాయని రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే.. రైతుభరోసాకు అందించినట్టు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. పెంచిన పెన్షన్‌ను అందించకుంటే రాజకీయంగా బుద్ధి చెప్పేందుకు పెన్షన్‌దారులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సీఎంకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్ నియోజకవర్గంలో మినీ మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆ సమావేశంలో పెంచిన పెన్షన్‌పై తాడోపేడో తేల్చుకుంటామని చెప్పారు.