రవీంద్రభారతి, డిసెంబర్ 14: కాంగ్రెస్ ప్రభుత్వం 9 మందినే కాకుండా 90 మంది ఉద్యమ పేద కళాకారులను గుర్తించి వారికి 300 గజాల ఇంటి స్థలంతోపాటు రూ. కోటి నజరానా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడు తూ.. వందలాదిమంది కవులు, కళాకారుల్లో 9 మందినే ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కళాకారుల ఎంపికకు గతంలో జ్యూరీ కమిటీ ఉండేదని గుర్తుచేశా రు.
గతంలో లబ్ధిపొందిన వారికే మళ్లీ నజరానా ఎంతవరకు సమంజసనమని ప్రశ్నించారు. ఉద్యమమే ఊపిరిగా పోరాడిన పీడిత కుటుంబాలకు లబ్ధి చేకూరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని, అందుకే అర్హులను గుర్తించడంలో విఫలమయ్యారని పేర్కొన్నా రు. ఒకే సామాజికవర్గం వారినే మెజార్టీ లబ్ధిదారులుగా గుర్తించారని ఆరోపించారు. ప్రభు త్వ చర్యలతో పేద కళాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖుడు కాదా? ప్రొఫెసర్ జయశంకర్, గాదె ఇన్న య్య, ననుమాస స్వామి గుర్తుకు లేరా? అని నిలదీశారు.
నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరు పెట్టడం, గద్దర్ కూతురు వెన్నెలకు సాం స్కృతి సారథి చైర్పర్సన్ ఇవ్వడాన్ని హర్షిస్తున్నట్టు తెలిపారు. ధూంధాంలో రసమయి బాలకిషన్, అంతడుపుల నాగరాజు కీలమని, ఎన్నోపాటలు రాసిన దరువు ఎల్లన్న, మిట్టపల్లి సురేందర్, దేవరకొండ సురేందర్, నేర్నాల కిశోర్‌ను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. వరంగల్ శ్రీనివాస్, రాయపోలు ఎల్లన్న, కోదారి శ్రీనివాస్, విమలక్క, మిద్దె రాములు, చుక్క సత్తయ్య లాంటి గొప్ప కళాకారులు కనిపించలేదా? అని విమర్శించారు.
బడుగు, బలహీనవర్గాల తల్లులకు వడ్డా ణం, కిరీటం, పట్టుచీరలు ఉండవని, సీఎం రేవంత్‌రెడ్డి తల్లిని తెలంగాణ తల్లి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఇలాంటి విగ్రహాలను బడుగు, బలహీనవర్గాలు ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించారు. పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన చాకలి ఐలమ్మ, సదాలక్ష్మి వంటి ఎంతో మంది తల్లుల రూపాలు ఎందుకు పెట్టలేదని, దీనిని పునఃసమీక్షించుకోవాలని సూచించారు. అణగారిన వర్గాలు అధికారంలోకి వస్తే పేదవర్గాల తల్లిని తెలంగాణ తల్లిగా తీసుకొస్తామని స్పష్టంచేశారు.