Mandakrishna Madiga | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో మంగళవారం ఆయన భేటీ అయ్యా రు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణను చిత్తశుద్ధితో చేపట్టినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి, సీఎంకు ఒక సోదరుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వర్గీకరణలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అసెంబ్లీలో చర్చించి, క్యాబినెట్ సబ్ కమిటీ, న్యాయ కమిషన్లను నియమించి, నివేదికలపై క్యాబినెట్లో చర్చించి, అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఎలాంటి న్యాయపరమైన చికులు లేకుండా చేశామని తెలిపారు. లోపాలు, అభ్యంతరాలను క్యాబినెట్ సబ్ కమిటీతోపాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
సీఎం సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మందకృష్ణ చర్చించారు. అనంతరం మా ట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయని స్పష్టంచేశారు. కొన్ని కులాలకు అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రధానంగా వెనుకబడిన మాదిగ కులానికి అన్యాయం జరిగిందని తెలిపారు. ‘గ్రూప్ బీ’కి కేటాయించిన రిజర్వేషన్లను 9 నుంచి 11 శాతానికి పెంచాలని కోరినట్టు వివరించారు. ఎకువ జనాభా ఉన్న నేతకానీలను మాలలున్న సీ గ్రూప్‌లో వేయడం వల్ల వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. జనాభా తక్కువగా ఉన్న కొన్ని కులాలను మొదటి గ్రూప్‌లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చారని, అదే సమయంలో ఎకువ మంది ఉన్న బేడ బుడగ జంగాలను అత్యధికంగా వెనుకబడిన ఏ గ్రూపులో వేశారని తెలిపారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన మాలలకు జనాభా నిష్పత్తి కంటే ఎకువ శాతం రిజర్వేషన్లు కేటాయించారని మండిపడ్డారు. వీటితోపాటు పలు అంశాలను సీఎంతోపాటు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీకి వివరించినట్టు చెప్పారు.