హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. ఇష్టారాజ్య వర్గీకరణతో తమకు న్యాయమైన వాటా దక్కలేదని తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఈ లెక్కన 32 లక్షల మంది ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగానే తమకు దక్కకుండా చేశారని ఆరోపించారు. మాదిగలకు జనాభా నిష్పత్తి కన్నా రిజర్వేషన్లు తక్కువ వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డికి ముందే తెలుసని విమర్శించారు. వర్గీకరణలో లోపాలతో వెనుకబడిన కులాల గ్రూప్‌లోకి అభివృద్ధి చెందిన కులాలు వచ్చాయని ఆరోపించారు.
పంబాల కులాన్ని ఎలా చేర్చారు?
అత్యంత వెనుకబడిన ఎస్సీ ‘ఏ’ గ్రూప్‌లో పంబాల కులానికి చెందిన ఘంటా చక్రపాణి లాంటి వాళ్లను ఎలా చేర్చారని మందకృష్ణ ప్రశ్నించారు. ఆయన ఇంట్లోనే ముగ్గురు, నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారని తెలిపారు. వాళ్ల జనాభా వెయి ఉంటే వంద మంది వరకు ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పారు. అంటే పది కుటుంబాలకు ఒక్క ఉద్యోగం ఉన్నదని ఉదహరించారు. అదే గ్రూప్‌లో ఉన్న తక్కల కులంలో 2,558 జనాభా ఉన్నా ఒక్క ఉద్యోగం అయినా ఉన్నదా? అని ప్రశ్నించారు. గతంలో ఏబీసీడీ వర్గీకరణ జరిగినప్పుడు పంబాల అనే కులం ‘అభివృద్ధి చెందిన’ కులాల జాబితాలో ఉండేదని తెలిపారు. ఇప్పుడు ఆ కులాన్ని అత్యంత వెనకబడిన కులాల జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. మన్నె అనే కులంలో 29వేల మంది ఉన్నారని, అభివృద్ధి చెందిన మన్నె కులాన్ని అత్యంత దయనీయ కులాల జాబితాలో ఎలా చేరుస్తారని నిలదీశారు. అత్యంత వెనకబడిన కులాల జాబితాలో అభివృద్ధి చెందిన కులాలను చేర్చి, రిజర్వేషన్లను దోచుకోవాలనే కుట్ర దాగున్నదని ఆరోపించారు.
మాలల ప్రాతినిధ్యం పెంపునకు వివేక్ కుట్ర
ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేమని గ్రహించి చివరి ప్రయత్నంగా మాలల ప్రాతినిధ్యం పెరగాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తమకు 11 శాతం కల్పించాల్సిన రిజర్వేషన్లను 9 శాతానికి తగ్గించారని తెలిపారు. ఇప్పటికైనా లోపాలను సవరించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. షమీం అక్తర్ వ్యక్తిగతంగా క్రీమీలేయర్ ఉండాలని సూచించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే వివేక్ గతంలో మాదిగ, మాలలతోపాటు నేతకాని కులానికి కార్పొరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు నేతకానిలకు వర్గీకరణలో వాటా కావాలని ఎందుకు కోరలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ నివేదిక తయారు చేసినప్పుడే కుట్రపై కసరత్తు జరిగినట్టుగా ఉన్నదని చెప్పారు. ఈ కసరత్తులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర నరసింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ భాగస్వామ్యులు అని ఆరోపించారు. దామోదర మౌనం, చేతగానితనం వల్లే మాదిగల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనను క్యాబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని, ఆయన స్థానంలో మరో ఇద్దరు మాదిగలకు మంత్రులుగా అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.