బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 2: మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీకి చులకనభావం ఉన్నదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే వర్గీకరణ చేయకపోతే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. బన్సీలాల్‌పేట్‌లోని అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలులో హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న జరగబోయే ‘వేల గొంతులు-లక్ష డప్పుల’ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికంటే ముందు తెలంగాణలో వర్గీకరణ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఐదు నెలలు పూర్తయిందని, వేచిచూడలేక న్యాయం కోసం రోడ్డెక్కాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కే హేమలత, ఎల్ ప్రసన్నలక్ష్మీ, రచయిత మిట్టపల్లి సురేందర్, జర్నలిస్టులు ఇస్మాయిల్, చంద్రశేఖర్, నాయకులు పృథ్వీరాజ్ యాదవ్, గోవిందు నరేశ్, బిక్షపతి, నర్సింహారావు, మల్లికార్జున్, అంజన్న, అశోక్, కేఎం కృష్ణ, బీ మహేశ్, ఎస్‌వై గిరి, మహేశ్, కే సతీశ్, ఎస్ రాజు, సుదర్శన్‌బాబు పాల్గొన్నారు.