ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 7 : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పొన్నం వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఒప్పకోదని స్పష్టంచేశారు. ఒక దళిత మంత్రిపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేస్తుంటే మరో దళితమంత్రి వివేక్ చూస్తూ కూర్చోవడమేంటని నిలదీశారు.
మాదిగ హక్కుల దండోరా ఖండన
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచితంగా చేసిన వ్యాఖ్యల పై మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్‌మాదిగ మండిపడ్డారు. అడ్లూరిపై అసభ్యకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.