అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మొదట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని దళితవాడలో వాసులు సూచించారు. దళితవాడలో సుమారు నెలరోజుల నుంచి తాగునీరు లేక అల్లాడుతున్నట్టు తెలిపారు.
గుక్కెడు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతూ కిలో మీటర్ల దూరం నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించిన తరువాతే అభ్యర్థులు ఓట్ల కోసం తమ కాలనీకి రావాలని సూచిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.