తిమ్మాపూర్, మే 24: మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల దందా జోరుగా నడుస్తున్నదని, రూ.50వేలు కొట్టు.. ఇల్లు పట్టు.. అని లబ్ధిదారులకు ఆఫర్ ఇస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలిసే ఇదంతా జరుగుతున్నదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి శనివారం తిమ్మాపూర్లోని పార్టీ కార్యాలయంలో రసమయి మాట్లాడారు. మానకొండూర్ నియోజకవర్గంలో ప్రభు త్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎం పిక జరగడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తూ తమకు నచ్చినవారికి ఇండ్లు ఇచ్చుకుంటూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.50వేలు ఇస్తేనే లిస్టులో పేరు వస్తుందంటూ బహిరంగంగా దందా చేస్తున్నారని విమర్శించారు. రూ.50వేలలో వారికి సగం, పైకి సగం వెళ్తాయని ఓ కాంగ్రెస్ లీడర్ చెప్పాడని తెలిపారు. ఓ మండలానికి చెందిన విలేకరికి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఎంపిక కాగా ఆయన నుంచి సైతం రూ.50వేలు వసూలు చేశారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 42వేల మంది ప్రజాపాలన సభల్లో దరఖాస్తు చేసుకోగా 3,500మందికే ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారని.. మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
మానకొండూర్ మండలం నిజాయితీగూడెంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రెండు, మూడు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి వెళ్తుంటే.. మిగతా లబ్ధిదారులు తమ పరిస్థితేంటని నిలదీయగా, తమ నాయకులు చూసుకుంటారనడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారని చెప్పారు. లబ్ధిదారులు తన వద్దకు వచ్చి రూ.50వేలు ఎక్కడి నుంచి తెస్తామని గోడు వెల్లబోసుకుంటున్నారని తెలిపారు. రాజీవ్ యువవికాసం కాంగ్రెస్ కార్యకర్తలకు చేయూత ఇచ్చేందుకు పెట్టారని ఎద్దేవాచేశారు. ఇందులో కూడా కమీషన్లు ఇచ్చేవారినే సెలెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని.. వెంటనే తడిసిన ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు.