హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): జైళ్ల నిర్వహణలో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రీట్రీట్ లో ఆమె మాట్లాడుతూ.. 2002 నుంచి రీట్రీట్ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చర్లపల్లి, కరీంనగర్, ఖమ్మం జైళ్ల వార్డర్లు, డిప్యూటీ జైలర్లకు రెండ్రోజులపాటు రీట్రీట్ నిర్వహస్తున్నట్టు చెప్పారు. డ్రగ్స్ బాధితులకు డీ అడిక్షన్ సెంటర్లు, జైళ్ల శాఖ సిబ్బంది, ఖైదీల సంక్షమంపై చర్చించనున్నట్టు తెలిపారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ.. జైళ్ల ఆధునీకరణ, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు, ఎస్ఐసీఏ శిక్షణ నిధులు, ఐఎల్ఎల్ బిల్లుల మంజూరు, చర్లపల్లి సెంట్రల్ జైలులో కొత్త బ్యారక్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. జైళ్ల శాఖ ఐజీలు రాజేశ్, మురళీబాబు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ పాల్గొన్నారు.