హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని హరిత హోటళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పర్యవేక్షణ లోపం, నిధుల దుర్వినియోగంతో హోటళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హరిత హోటళ్ల బాగోగులపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంతో నాణ్యత లోపాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 21 హరిత హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు రిసార్టులు ఉన్నాయి. ప్రైవేట్ లేదా ఇతరులకు ఈ హోటళ్లను లీజ్‌కు ఇచ్చినా.. మౌలిక వసతుల కల్పన పెరిగి పర్యాటకులు పెరిగే అవకాశం ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు. కొందరు అధికారులు కావాలనే నష్టాలు చూపిస్తున్నారని టూరిజం శాఖకు చెందినవారు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం డైవర్షన్ పాలిటిక్స్‌పై అధిక దృష్టి పెట్టింది కానీ, తెలంగాణలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలి.. దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించాలి అన్న ధ్యాస లేకుండా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. కుంభకోణాలు, వాటాలు, డైవర్షన్ పాలిటిక్స్ వంటి వాటిపైనే ముఖ్యమంత్రి సహా రాష్ట్ర క్యాబినెట్ ఆసక్తి చూపిస్తున్నదని, ఆదాయాలు ఆర్జించి పెడుతున్న ఇలాంటి పర్యాటకం వంటి శాఖల అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ టూరిజానికి పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే.