Govt Schools | మహబూబ్నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 17: ‘చాక్పీసులు, డస్టర్లు కొనలేకపోతున్నాం.. పిల్లలకు అవసరమైన చార్టులు, పుస్తకాలు తెద్దామంటే డబ్బులు లేవు.. సమావేశాలకు వచ్చే టీచర్లకు టీ, స్నాక్స్ ఇవ్వలేకపోతున్నాం.. మొత్తంగా పాఠశాలల నిర్వహణ ఇబ్బందిగా మారింది..’ అంటూ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాలలకు రావాల్సిన గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు పూర్తయినా గ్రాంట్లు విడుదల కాలేదు.
క్రీడా పరికరాలకు నిధుల్లేవు
ఇటీవల పీఈటీలకు పీడీలుగా పదోన్నతి కల్పించారు. విద్యార్థులకు పలు పాఠశాలల్లో క్రీడా పరికరాలు లేవు. క్రీడల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఆటలకు దూరం అవుతున్నారు. ఈసారి నిధులు మంజూరు చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషిచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సొంతంగా ఖర్చు చేస్తున్నాం
పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలైనా నిర్వహణ నిధులు మంజూరు కాలేదు. దీంతో పాఠశాలలో రోజూవారి నిర్వహణ ఖర్చులు, సుద్ధ్దముక్కలు, స్టేషనరీ, ఇతరత్రా ఖర్చులకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
– అబ్దుల్హక్, తెలంగాణ రాష్ట్ర జీహెచ్ఎం సంఘం మహబూబ్నగర్ ప్రధాన కార్యదర్శి
చాలా ఇబ్బందికరంగా ఉంది
పాఠశాలల నిర్వహణ నిధులు లేవు. పాఠశాలల్లో పరిశుభ్రత పనులు చేసే వారికి సైతం చెల్లించేందుకు నిధులు లేవు. అమ్మా డబ్బులు ఇస్తారా? ఎప్పుడిస్తారు? అని స్కావెంజర్లు అడుగుతున్నారు. వారికి ఏమీ చెప్పలేకపోతున్నాం.
– పీఆర్ మాలినీదేవి, జీహెచ్ఎం, కరివెన, భూత్పూరు మండలం, మహబూబ్నగర్
క్రీడలపై నిర్లక్ష్యం
పాఠశాలలు తెరిచిన వెంబడే పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తారు. క్రీడాసామగ్రి మాత్రం ఇవ్వరు. ఈ రోజు స్కూల్గేమ్స్ ప్రారంభం అయ్యాయి. పాఠశాలల ప్రారంభం రోజునే క్రీడాసామగ్రి ఇవ్వడంతోపాటు క్రీడల నిర్వహణకు నిధులు కేటాయించాలి.
– వడ్డెన్న, పీఈటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి, మహబూబ్నగర్
త్వరలోనే నిధులు విడుదల
పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులు త్వరలో విడుదల కానున్నాయి. హెచ్ఎంలు తాము పెట్టిన ఖర్చు వివరాల దస్ర్తాలు అందుబాటులో ఉంచుకోవాలి. నిధులు వచ్చిన తర్వాత వాటినుంచి ఖర్చుల లెక్కలు సరిచూసుకుని మిగిలిన డబ్బులు నిర్వహణ నిధుల కింద వాడుకోవాలని సూచించాం.
– రవీందర్, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్నగర్