హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : తమ కాలేజీలో ఫ్యాకల్టీ లేరన్న కొందరి ఆరోపణలను గోకరాజు రంగరాజు కాలేజీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ జుగ్గే సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆదివారం ‘లేని ఫ్యాకల్టీ ఉన్నట్టుగా..’ శీర్షిక పేరుతో ‘నమస్తే తెలంగాణ’లో వార్త ప్రచురితమైంది. కాలేజీ ఎంప్లాయిస్ అసోసియేషన్ పేరుతో కొందరు కాలేజీపై పలు ఆరోపణలు చేస్తూ, ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమయ్యింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం సోమవారం ఆరోపణలను ఖండించింది. కొందరు ఆకాశరామన్నలు తమ కాలేజీపై ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని, వారి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని డాక్టర్ ప్రవీణ్ ప్రకటించారు.
కొందరు కావాలనే తమ విద్యాసంస్థకు అప్రతిష్ఠ తెచ్చేందుకు, నష్టం కలిగించేందుకు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదే పనిగా ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారని, వీటిని ఎవరు నమ్మవద్దని పేర్కొన్నారు. తమ కాలేజీలో అన్ని రకాల మౌలిక వసతులున్నాయని, విద్యార్థులకు సరిపోయేలా ల్యాబ్లు, పరికరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), జేఎన్టీయూహెచ్ నిబంధనలకు అనుగుణంగా కాలేజీని నడుపుతున్నామని తెలిపారు. తాము ఎలాంటి అనైతిక పద్ధతులు అవలంభించడంలేదని ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి ఆరోపణలను నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు.