ఝరాసంగం, నవంబర్ 9 : పదిహేనేండ్ల వయస్సులో పుట్టినూరు, సొంతవాళ్లను వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి 50 ఏండ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొప్పనపల్లికి చెందిన కమ్మరి నాగప్ప, మోహనమ్మ దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడైన సంగన్న 15వ ఏట నుంచి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని చంద్రగిరికి వెళ్లాడు. అక్కడ ఓ మహిళను వివాహం చేసుకోగా, వారికి నలుగురు సంతానం కలిగారు. అక్కడే సొంతింటిని నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. అప్పటి నుంచి గ్రామానికి రాలేదు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సంబంధాలు లేకుండా పోయాయి. కాగా సంగన్న ఆదివారం బొప్పనపల్లికి తిరిగి రావడంతో గ్రామస్థులు కొద్దిసేపు గుర్తుపట్టలేకపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు సంగన్నను గుర్తించి సంబురపడ్డారు.