అందోల్, ఏప్రిల్ 24: పోలీసులు తరుచూ బైక్కు చలాన్లు విధిస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి పోలీసుల ఎదుటే తన బైక్ను తగులబెట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకొన్నది. చౌటకూర్ మండలం శివ్వంపేటకు చెందిన పాండు శనివారం రాత్రి తన బైక్పై అన్నాసాగర్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడ జోగిపేట పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. పాండును ఆపి పత్రాలు పరిశీలించారు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో రూ.1,100 జరిమానా విధించారు. ఆగ్రహంతో ఊగిపోయిన పాండు అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్లాడు. పెట్రోల్ పోసి బండికి నిప్పంటించాడు. పోలీసులు గమనించి మంటలు ఆర్పేలోపే బండిపూర్తిగా కాలిపోయింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొన్నారు.