హైదరాబాద్: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో (Malakpet) కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం శాలివాహన నగర్‌లోని పార్క్ వద్ద చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చందూనాయక్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పార్క్ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, పార్క్‌లో వాకింగ్ చేసుకుంటుంగా ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు చందూ నాయక్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారని వెల్లడించారు. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. స్విఫ్ట్ కారులో వచ్చిన ముగ్గురు నుంచి నలుగురు దుండగలు శాలివాన నగర్ పార్కు వద్ద చందూ నాయక్ కళ్లలో కారం కొట్టారని, అనంతరం ఆయనపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని పేర్కొన్నారు. అనంతరం అక్కడిని పరారయ్యారని తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దేవరుప్పలకు చెందిన సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేశ్‌పై ఆమె అనుమానం వ్యక్తం చేశారని వెల్లడించారు. అయితే భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.