Rangareddy | రంగారెడ్డి జిల్లా కోర్టులు, జనవరి25 (నమస్తే తెలంగాణ): అభం శుభం తెలియని నాలుగేండ్ల మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నేరానికి నిందితుడు దేశగోని ఆనంద్‌గౌడ్ (34)కు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పినిచ్చింది. 25 వేల జరిమానా, బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం అందజేయాలని న్యాయసేవా సంస్థను ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు పీపీ కోమలత తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గండిచెరువు గ్రామానికి చెందిన ఆనంద్‌గౌడ్ మద్యానికి బానిసై నిత్యం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.
నిందితుడు ఆనంద్ ఇంట్లో ఒంటరిగా ఉండగా 2022 అక్టోబర్ 27న తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించి లైంగికదాడికి పాల్పడ్డాడని, గతంలో కూడా ఇలాగే చేశాడని బాలిక తన తల్లికి తెలపింది. దీంతో బాలిక తల్లి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు, సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం శిక్ష విధిస్తూ పైతీర్పునిచ్చింది.