కోరుట్ల, ఆగస్టు 6: ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి అర్ధాంతరంగా చనువు చాలించాడు. చాలా రోజుల తర్వాత సెలవుల్లో స్వగ్రామానికి బయల్దేరిన అతను ఇంటికి చేరేలోపే అనారోగ్యంతో ప్రాణాలు వదిలాడు.
మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డు కాలనీకి చెందిన శ్రీరాముల శ్రీధర్ (46) కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశం సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లాడు. ఊరికి వెళ్లి చాలా రోజులు అవ్వడంతో కుటుంబాన్ని చూడాలనే ఆశతో సెలవులు తీసుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. ఇదే విషయాన్ని భార్యకు, ఇద్దరు కూతుళ్లకు చెప్పాడు. సౌదీ అరేబియాలో మంగళవారం ఉదయం ఒంటి గంటకు సౌదీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరాడు. కానీ మార్గమధ్యలో ఫ్లైట్‌లోనే గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యాడు.
తనకు శ్వాస ఆడటం లేదని విమాన సిబ్బందికి తెలపడంతో విమానాన్ని అత్యవసరంగా ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. సమచారం అందుకున్న వైద్యులు.. వెంటనే వచ్చే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శ్రీధర్‌ను పరీక్షించిన వైద్యులు.. అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. చాలా రోజుల తర్వాత నాన్నను చూస్తామని ఆశపడిన ఇద్దరు కూతుళ్లకు తండ్రి మరణవార్త తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.